ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి రోజురోజుకి మరింత అద్వానంగా మారుతుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కి జై కొట్టి వైసీపీ గూటికి చేరిపోయారు. దీనితో చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా అయినా ఉంటుందా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు కి ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా షాక్ ఇచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుంది.
విశాఖపట్నం జిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణబాబు అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాలం అశోక్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. వెలగపూడి రామకృష్ణ విషయంలో గత కొంతకాలంగా అధికార పార్టీ నేతలు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రామకృష్ణ ఆస్తుల మీద అలాగే ఆయన అనుచరులు మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు.
ఇబ్బందుల నుంచి బయటకు రావాలి అంటే వైసీపీ లోకి వెళ్లడం ఒకటే మార్గం అనే భావనలో వెలగపూడి ఉన్నారని ఆయన అనుచరులు సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా అశోక్ కి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వద్ద నుంచి సహకారం రావడంలేదని దీనితో ఆయన కూడా పార్టీ మారడానికి వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. అయితే వీరిద్దరు ఎప్పుడు మారుతారు ఏంటీ అనేది ఇంకా స్పష్టత లేకపోయినా రాబోయే రెండు మూడు వారాల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.