ఏపీలో బైజూస్ రగడ: వైసీపీ వర్సెస్ టీడీపీ.!

అసలంటూ రచ్చ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదీ జరగదు. బైజూస్ సంస్థతో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది, స్కూళ్ళలో నాణ్యమైన విద్య విషయమై. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇదొక విప్లవాత్మకమైన ఆలోచనగా భావిస్తున్నారు. విద్యా రంగంలో బైజూస్ నిజంగానే ఓ సంచలనం. నిపుణులైన అధ్యాపకులతో, పాఠాల్ని తేలిగ్గా విద్యార్థులకు అర్థమయ్యే ప్రోగ్రామ్స్ బైజూస్ రూపొందిస్తోంది.

మామూలుగా అయితే బైజూస్ కంటెంట్ కోసం భారీగా ఖర్చు చేయాలి. కానీ, బైజూస్ – రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందం నేపథ్యంలో పేద విద్యార్థులకు ఉచితంగానే ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన విద్య లభించనుంది. వాస్తవానికి దీన్ని ఎవరైనా స్వాగతించి తీరాల్సిందే.

కానీ, ఒక్కటే అనుమానం. డబ్బు చుట్టూనే బైజూస్ విద్యా వ్యాపారం నడుస్తుంటుంది. దాదాపుగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఈ విషయం తెలుసు. గత కొన్నాళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్ళి మరీ బైజూస్ ప్రతినిథులు, తమ విద్యా విధానాన్ని అమ్మేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వేలల్లో, లక్షల్లో ఫీజులు చెబుతున్నారు.

సాధారణ జనాన్ని బైజూస్ పీక్కు తినేస్తోందన్న విమర్శ లేకపోలేదు. మరి, రాష్ట్ర ప్రభుత్వానికీ.. బైజూస్ సంస్థకీ కుదిరిన ఒప్పందం ఎలాంటిది.? ఇదే ప్రశ్న విపక్షాల నుంచి మరీ ముఖ్యంగా టీడీపీ నుంచి వస్తోంది. ఇలాంటి ఒప్పందాల్ని చాలా తెలివిగా డీల్ చేసి, జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసే టీడీపీ అధినేత చంద్రబాబుకీ అలాంటి డౌటే వచ్చింది. వైసీపీ సర్కారు మీద విరుచుకుపడ్డారు కూడా.

దానికి కౌంటర్ ఎటాక్ అన్నట్టు.. బైజూస్ అంటే హెరిటేజ్ ఫ్యాక్టరీలో తయారయ్యే జ్యూస్ కాదంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్ వేయడం గమనార్హం