కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టీడీపీకి షాకివ్వబోతున్నారా? తనకు టికెట్ దక్కే అవకాశం లేదని భావించిన ఆమె సొంత గూటికి చేరుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చేరికతో కర్నూలు టికెట్‌ను ఇవ్వలేమని అధిష్ఠానం రేణుకకు స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
దీంతో ఆమె సొంత పార్టీ అయిన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నేడు ఇడుపులపాయలో ఆమె వైసీపీ చీఫ్ జగన్‌ను కలుసుకోబోతున్నట్టు కూడా సమాచారం.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికతో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆయన కుటుంబానికి కేటాయించాలని టీడీపీ నిర్ణయించిందని, దీంతో సిట్టింగ్ ఎంపీ అయిన రేణుకకు ఆదోని అసెంబ్లీ స్థానాన్ని ఆఫర్ చేసిందని సమాచారం. అయితే, అసెంబ్లీకి వెళ్లేందుకు రేణుక ససేమిరా అన్నట్టు చెబుతున్నారు.
రేణుకను వదులుకోవడానికి ఇష్టంగా లేని టీడీపీ అధిష్ఠానం రాజ్యసభకు పంపుతామన్న హామీ ఇచ్చినా ఆమె మాత్రం పార్టీ వీడేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బుట్టా రేణుక తిరిగి తన స్వంత గూటికి చేరడం ఖాయమని చర్చ జరుగుతోంది. ఆమెకు కర్నూల్ ఎంపీ సీటు కేటాయించేందుకు జగన్ కూడా సుముఖంగా ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.