ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల వేట.!

భారత్ రాష్ట్ర సమితి తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే నాయకులెవరు.? అని గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘వెతుకులాట’ షురూ చేశారట. ఆంధ్రప్రదేశ్‌లోని కనీసం ఐదు లోక్ సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని 2024 ఎన్నికల్లో నిలబెట్టాలన్నది కేసీయార్ వ్యూహంగా కనిపిస్తోంది.

కుదిరితే ఓ పాతిక నుంచి ముప్ఫయ్ వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టాలని కేసీయార్ ఆలోచన చేస్తున్నారట. మజ్లిస్ సాయంతో కర్నూలు, గుంటూరు సహా పలు నగరాల్లో రహస్య సమావేశాలు నిర్వహించి, భారత్ రాష్ట్ర సమితికి గల అనుకూల పరిస్థితుల్ని వాకబు చేయించనున్నారట కేసీయార్.

మరోపక్క, హైద్రాబాద్ కేంద్రంగా కేసీయార్ తనయుడు కేటీయార్ తనదైన వ్యూహాల్ని రచిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నిమిత్తం. ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్న ఒకప్పటి రాజకీయ ప్రముఖుల్ని కూడా కేటీయార్ కలుస్తున్నారట.

2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలకూ కలిసొచ్చేలా అటు కేసీయార్, ఇటు కేటీయార్.. ఇంకో వైపు కవిత, మరో వైపు హరీష్ రావు.. పలువురు గులాబీ పార్టీ సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పరిస్థితులు అనుకూలంగా వుంటాయన్నదానిపై హైద్రాబాద్‌కి చెందిన స్వామీజీ ఒకరు, విశాఖకు చెందిన స్వామీజీ ఒకరితో మంతనాలు జరుపుతున్నారట గులాబీ పార్టీ నేతలు.