Brother Anil : ఇది క్లియర్: వైఎస్ జగన్‌పై పోరుకి బ్రదర్ అనిల్ సిద్ధం.!

brother anil

Brother Anil : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ సన్నద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. స్వయానా వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల భర్తే ఈ ‘బ్రదర్’ అనిల్ కుమార్.

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తెరవెనుక చాలా కష్టపడ్డారు అనిల్. క్రైస్తవ మత సంఘాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చి, ‘క్రైస్తవ ఓటు బ్యాంకు’ అంతా వైసీపీ వైపు మళ్ళేలా వ్యూహం రచించి, బ్రదర్ అనిల్ సక్సెస్ అయ్యారు. కానీ, ఏమయ్యిందో.. ఎన్నికల్లో గెలిచాక వైఎస్ జగన్, తన సోదరి షర్మిల సహా బ్రదర్ అనిల్ కుమార్‌ని కూడా పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది.

షర్మిల, తెలంగాణలో ఇప్పటికే ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. ఏపీలోనూ పార్టీని విస్తరించాలంటూ షర్మిలపై ఒత్తిడి వస్తోందంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది.

ఈ క్రమంలోనే షర్మిల భర్త, ఏపీలో రాజకీయం చక్కబెట్టేస్తున్నారు. తాజాగా విశాఖలో క్రైస్తవ మత సంఘాల నాయకులతో చర్చలు జరిపారు బ్రదర్ అనిల్ కుమార్. బీసీ, మైనార్టీ సంఘాలు కూడా తన మద్దతు కోరుతున్నట్లు చెప్పారాయన.

కొత్త పార్టీ దిశగా ఏపీలో బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు కొందరు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వారు గనుక కొత్త పార్టీ పెడితే, వారికి తాను మద్దతిస్తానని కూడా బ్రదర్ అనిల్ కుమార్ ప్రకటించేయడం గమనార్హం.

‘ఇచ్చిన హామీల్ని ప్రభుత్వంలోకి వచ్చాక నిలబెట్టుకోవాలి. కానీ, అలా జరగలేదు. అందుకే అప్పుడు వైసీపీకి మద్దతిస్తున్న చాలా వర్గాలు అసంతృప్తితో వున్నాయి. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద వుంది..’ అంటూ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే, నేరుగానే వైఎస్ జగన్‌తో రాజకీయ యుద్ధానికి బ్రదర్ అనిల్ సన్నద్ధమయ్యారని అనుకోవాలేమో.!