ఏపీ సీఎం వైఎస్ జగన్ , బావ బ్రదర్ అనిల్ మెడకు వివాదం చుట్టుకుంటోంది. ఇటీవల ఏపీలో ఆలయాల మీద జరిగిన దాడులకు సంబంధించి విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ను అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. ఇతర మతాలను కించపరిచేలా యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా, తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల విగ్రహాలను కాలితో తన్నానంటూ వీడియోలో పేర్కొన్నాడు.
గత ఏడాది పోస్టైన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు. అయితే, ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. అందులో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందని వెల్లడించారు. 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు డీజీపీ సవాంగ్ వెల్లడించారు.
అయితే ఇపుడు తాజాగా ఈ అంశం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు వైసీపీ చుట్టూ అల్లుకుంటోంది. ఈ కేసులో చిక్కుకున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కి వైసీపీ కి సంభందాలు ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్‌తో సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేత, మాజీ హోంమంత్రి చినరాజప్ప అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విషయం పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఇపుడు ఏపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ ‘బ్రదర్ అనిల్’ ను కార్నర్ చేయగా ఆయన ఇపుడు ఇందులో చిక్కుకుపోయాడు. సీఐడీ, సీబీఐ విచారణ వేయాలి. ప్రవీణ్ చక్రవర్తి ఎవరు? ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి? మతమార్పిడులను పెంచి పోషిస్తున్నాడా? అన్నీ విచారణ జరపాలి.’ అని చినరాజప్ప డిమాండ్ చేశారు.