గత కొన్ని రోజులుగా ఏపీ సర్కార్ పై వారాహి వాహనంపైనా.. ఆన్ లైన్ లోనూ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై తాజాగా ఒక ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో విద్యా వ్యవస్థపై పవన్ స్పందించారు. దీంతో ఇదే ట్విట్టర్ లో పవన్ కి సూటిగా సమాధానం ఇస్తూనే.. దిమ్మతిరిగే సెటైర్స్ వేశారు బొత్స!
అవును… జనసేనాని పవన్ కల్యాణ్, మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఏపీ విద్యా వ్యవస్థపై పవన్ సెటైరికల్ ట్వీట్ కి అంతే సెటైరిక్ గా స్పందించారు మంత్రి బొత్స. ఇదే సమయంలో “ఈరోజు నుంచి నీకు నేను ట్యూషన్ చెబుతాను పవన్”.. అంటూ ఓ ట్వీట్ చేసిన బొత్స… పవన్ కచ్చితంగా హోం వర్క్ చేయాలని సూచించారు. అంతే కాదు 7 పాఠాలు కూడా అందులో ఉంచారు.
విద్యార్థులకు ట్యాబ్ ల కంటే ముందు మరుగుదొడ్లు నిర్మించండి.. యాప్స్ తర్వాత ముందు టీచర్లను నియమించండి.. అంటూ పవన్ కల్యాణ్ ఏపీ విద్యావ్యవస్థపై ట్వీట్లు వేశారు. ట్యాబ్ ల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని. నష్టాల్లో ఉన్న బైజూస్ వంటి కంపెనీలకు ఆన్ లైన్ పాఠాల పేరుతో పెద్ద మొత్తం సమర్పిస్తున్నారని. డిజిటల్ బోధన అనేది పెద్ద మోసం అని, దానివల్ల విద్యార్థులకు లాభం లేదని తనదైన నాలెడ్జ్ ని ప్రదర్శించారు!
దీంతో ఈ ట్వీట్ పై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. టెండర్లలో అక్రమాలేవీ జరగలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఇస్తూ 7 పాఠాలు అనే పేరుతో పవన్ పై సెటైర్లు వేశారు మంత్రి బొత్స. అనవసరంగా ప్రభుత్వంపై బురదజల్లొద్దని హితవు పలికారు. పవన్ కి తాను పాఠాలు చెబుతాను.. ఆయన హోం వర్క్ చేయాలని స్మూత్ గా వేశారు!
ఈ సందర్భంగా బొత్స చేసిన ట్వీట్…
“ప్రియమైన పవన్ కళ్యాణ్… ఈరోజు నుండి నేను నీకు ట్యూషన్లు తీసుకుంటాను. కానీ నాది ఒకటే షరతు. అది ఏమిటంటే.. నువ్వు నీ హోమ్ వర్క్ చేస్తానని హామీ ఇవ్వాలి! ఈ 7 పాఠాలను క్షుణ్ణంగా చదవడమే నేటి అసైన్ మెంట్” అని మొదలుపెట్టారు బొత్స సత్యనారాయణ!
పాఠం-1: పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ లకు సంబంధించినంతవరకు అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని వివాదరహితంగా చేస్తోన్న ప్రపంచంలోని ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని దయచేసి తెలుసుకోండి.
పాఠం-2: రూ. 100 కోట్లకు పైబడిన ప్రభుత్వ టెండర్ ఏదైనా… దాని పరిధిని, అర్హతను ఖరారు చేయడం హైకోర్టు సమ్మతితో నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తిచే చేయబడుతుంది.
పాఠం-3: టెండర్ స్పెసిఫికేషన్‌లు పబ్లిక్ డొమైన్ లో ఉంచబడతాయి, కంపెనీలకు వ్యాఖ్యానించడానికి / ప్రతిస్పందించడానికి 21 రోజుల సమయం ఇవ్వబడుతుంది. దీన్ని పోస్ట్ చేసిన న్యాయమూర్తి కాల్ తీసుకుంటారు!
పాఠం-4: న్యాయపరమైన ప్రివ్యూను కలిగి ఉన్న ప్రపంచంలోని ఏకైక ప్రభుత్వం మాది అని హైలైట్ చేయడానికి మేము గర్విస్తున్నాము!
పాఠం-5: అదేవిధంగా… బేసిక్ గూగుల్ సెర్చ్ మీకు ఈ నిర్దిష్ట టెండర్ కోసం ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్న అన్ని కంపెనీల వివరాలను అందిస్తుంది. (ఆగస్టు 2022 నుండి ఈ వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి!)
పాఠం-6: ఏపీ విద్యా రంగానికి సంబంధించినంతవరకు, ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఫలితాలు అందిస్తూ అత్యంత పారదర్శకమైన ప్రభుత్వం మాది అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నాము!
పాఠం-7: ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నానికి సిగ్గుపడాల్సిన పరిస్థితిలో ఉన్న మీ ఉపాధ్యాయుల పట్ల నేను జాలిపడుతున్నాను. కానీ నేను చెప్పినట్లుగా.. మీరు శ్రద్ధగా, మీ బుర్ర వాడతానని వాగ్దానం చేసినంత కాలం నేను మీకు ట్యూషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను!
అని ముగించారు ఏపీ విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ!