షాకింగ్ న్యూస్: టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత

ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. పాత బంధాలు తెంచుకోవడం, కొత్త స్నేహాలు ఏర్పడడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. ఈ తరుణంలో ఆంధ్రాలో చోటు చేసుకొంటున్న తాజా పరిణామాలు ఎన్నికల సమీకరణలలో మార్పులు తెస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త మార్పులు చర్చనీయాంశం అయ్యాయి. ఇక నేతలు ఏ నిమిషానికి ఏ గూటికి చేరుతారో అర్ధం కానీ పరిస్థితి. పార్టీల అధినేతలు కూడా అభ్యర్థుల ఎంపిక, పార్టీని బలోపేతంపై కసరత్తు చేస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్ ఎన్నికలకు కొంతకాలం ముందే అభ్యర్థులను నియోజకవర్గాల సమన్వయకర్తలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి పంపుతారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం చివరి నిమిషం దాకా అభ్యర్థులను ప్రకటించరు. నేతలు మాత్రం ఈసారి టికెట్ ఉంటుందో లేదో అని లాస్ట్ మినిట్ వరకు ఊపిరి బిగబట్టుకుని కూర్చోవాల్సిందే. ఈసారి చంద్రబాబు ఆ ఆనవాయితీకి విరుద్ధంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

ఇదిలా ఉంటే నియోజకవర్గాల్లో నేతలు పార్టీలో అసంతృప్తి చేతనో, లేదా తాము ఆశించిన టికెట్ రాలేదనో పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వలసలు పెరిగిపోతున్నాయి. ఇక పార్టీల అధినేతలు కూడా పదవుల ఎర వేసి బలమైన నాయకులను, వేరొక పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను తమ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ఈమేరకు ఆయన మంగళవారం అమరావతిలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. సుమారు వీరిద్దరూ 20 నిమిషాలపాటు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీడీపీలోకి చేరడానికి ఆయన సుముఖంగా ఉన్నట్టు ఆయన చంద్రబాబుకి తెలియజేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించి, తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

కాగా బొమ్మిరెడ్డి మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని చంద్రబాబుకి తెలియజేసారని తెలుస్తోంది. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీ తరపున వెంకటగిరి ఇంచార్జి గా నాలుగేళ్లపాటు పని చేశారు. అయితే టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆనం రాంనారాయణరెడ్డికి వెంకటగిరి టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తి చెందారు. దీంతో ఆయన ఇటీవలే వైసీపీని వీడారు.