ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో ముగ్గురు మృతి.. 11 మందికి తీవ్రగాయాలు!

దేశంలో వాహనాల సంఖ్య పెరగటం వల్ల రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే పోతుంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వాహనదారులు అజాగ్రత్తతో వాహనాలను నడపటం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 11 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల మేరకు… గురువారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కోరుకొండ మండలం శ్రీరంగ పట్నం వైపు వెళ్తున్న బొలెరో వాహనం కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపైకి చేరుకున్న తర్వాత అక్కడ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. బొలెరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల వాహనంలో ఉన్న వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకి తెలియజేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మరో పదకొండు మంది త్తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం పై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నారు.