కమల రాజకీయం: 2019లో తప్పిదం.! 2014 మాటేమిటి.?

‘ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో పొరపాటు జరిగిపోయిందనీ, మళ్ళీ 2024లోనూ అదే పొరపాటు జరిగితే భగవంతుడు కూడా రక్షించలేడు..’ అంటూ కమలనాథులు కొత్త పల్లవి అందుకున్నారు. టీడీపీ నుంచి వ్యూహాత్మకంగా బీజేపీలోకి దూకేసిన మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ ‘పొరపాటు’ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కులాలు, మతాలు, ప్రాంతాలకు అతతంగా ఆలోచించి నడచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసేశారు రాష్ట్ర ప్రజానీకానికి. ‘మనం – మ అమరావతి’ పేరుతో బీజేపీ, ఇటీవల అమరావతి పరిధిలో పాదయాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర ముగింపు కార్యక్రమంలో సుజనా చౌదరి సహా, బీజేపీ ముఖ్య నేతలు విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.

2014 మాటేమిటి.?

2019లో పొరపాటు జరిగిందనే అనుకుందాం.! మరి, 2014 ఎన్నికల్లో జరిగినదాన్ని ఏమనాలి.? దాన్ని గ్రహపాటు అనుకోవాలా.? ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, 2014 ఎన్నికల సమయంలో బీజేపీ – టీడీపీ కలిసి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం చేపట్టాయి.

ఆంధ్రప్రదేశ్ మీద అంతటి మమకారం బీజేపీకి వుండి వుంటే, ఏనాడో ప్రత్యేక హోదా ఇచ్చి వుండేది. కానీ, అలా జరగలేదు. ఇప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. పోనీ పోలవరం సంగతి తేల్చారా.? అంటే అదీ లేదాయె. రాజధాని అమరావతికి ఇవ్వాల్సిన నిధులూ ఇవ్వలేదు.

ఎలా చూసుకున్నా, టీడీపీ అలాగే వైసీపీ కంటే బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నది నిర్వివాదాంశం. అందుకే, 2014 ఎన్నికల్లో బీజేపీ పట్ల కాస్తో కూస్తో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఓటర్లు, 2019 ఎన్నికల్లో బీజేపీకి సున్నా చుట్టేశారు.

వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ పరిస్థితి అంతే. అయినాగానీ, కేంద్రంలో అధికారంలో వున్నామనే అహంకారంతో, రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టుపట్టించేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే వుంది.