బీజేపీని వైసీపీ గుడ్డిగా నమ్మితే.. కష్టమే.!

రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్దయెత్తున నిధులు వస్తున్నాయ్.! మంచి విషయమే ఇది.! కాకపోతే, వస్తున్న నిధుల విషయమై వైసీపీ సర్కారు ఒకింత అత్యుత్సాహానికి గురవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలపడంలో ఏపీ వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఇలా అందరిదీ అదే దారి.! ఎప్పుడో ఇవ్వాల్సిన నిధుల్ని, నానబెట్టీ.. నానబెట్టీ.. మురగబెట్టీ.. మురగబెట్టీ.. ఇప్పుడు ఇస్తోంది కేంద్రం.

నిజంగానే ఇస్తోందా.? ఇస్తున్నట్లు చెబుతోందా.? కొన్ని నిధుల్ని విడుదల చేసి, కొన్నిటిని విడుదల చేస్తామంటోంది కేంద్రం. ఇది ఎన్నికల సంవత్సరం. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చూస్తే, ఎప్పటికప్పుడు కొత్త అప్పులు చేసుకోవాల్సిందే. ఈ లెక్కన, కేంద్రం నుంచి వస్తున్న నిధులు దేనికి సరిపోతాయ్.? చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సి రావడం ఓ పెద్ద తలనొప్పి.

నిధులు వస్తున్నాయ్ గనుక, ప్రత్యేక హోదా మర్చిపోతే కష్టం. కానీ, దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యేక హోదాని మర్చిపోయాయ్.. వైసీపీతో కలుపుకుని.! కేంద్రాన్ని పొగుడుతూ పోతే, ముందు ముందు రాజకీయంగా బీజేపీని విమర్శించే అవకాశం వైసీపీకి వుండదు.

సో, బీజేపీని.. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన రీతిలో ప్రశ్నించడమే, రాష్ట్రానికీ.. వైసీపీకీ మంచిది.! నమ్మి నట్టేట్లో మునిగే పరిస్థితి తెచ్చుకోకూడదు వైసీపీ, టీడీపీ తరహాలో.!