JC – Madhavi Latha: తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ మహిళా నేత, నటి మాధవీ లత మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. జేసీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ పరిష్కరించేందుకు ప్రయత్నించినా, మాధవీ లత మాత్రం ఈ వ్యవహారాన్ని సులువుగా ముగించేందుకు తలవంచడం లేదు. తాజాగా ఆమె సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలసి జేసీపై ఫిర్యాదు చేసారు.
వివాదానికి కారణం, జేసీ నూతన సంవత్సర వేడుకల్లో మహిళలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చేసిన ప్రకటన. ఈ విషయంపై మాధవీ లత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జేసీ కార్యక్రమానికి మహిళలు హాజరు కాకూడదంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆమె వ్యాఖ్యలు జేసీకి కోపం తెప్పించడంతో, ఆమెపై తీవ్రస్థాయిలో వ్యభిచారి అంటూ విమర్శలు చేశారు. మాధవీ లతపై ఆ విధంవా ఆయన వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది. తన వ్యాఖ్యలు దాటిగా మారాయని గుర్తించిన జేసీ తర్వాత క్షమాపణలు చెప్పినా, మాధవీ లత ఆందోళన చెందారు.
తన కుటుంబం ఈ వివాదంతో తీవ్రంగా బాధపడుతోందని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడి సారీ చెప్పడం సరిపోతుందా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతకుముందు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించిన మాధవీ లత, జేసీపై మరింత దృఢంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసి, తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. జేసీ వ్యాఖ్యలు తాను మానసికంగా, సామాజికంగా ఇబ్బందులకు గురిచేశాయని, ఈ వివాదంలో కఠిన చర్యలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది నిజానికి తాడిపత్రి రాజకీయ వాతావరణంలో ఒక ఆసక్తికరమైన మలుపుగా మారింది. మాధవీ లత ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.