151 ఎమ్మెల్యే సీట్లు, 21 ఎంపీ స్థానాల భారీ మెజారిటీతో గెలిచి ఆరుగురు రాజ్యసభ సభ్యులను కలిగి ఉండటం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ నెంబర్లు చూస్తే సదరు పార్టీకి రాష్ట్రం మీద ఎంత పట్టుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాంటి పార్టీతో, ఆ పార్టీ నాయకుడితో ఏ జాతీయ పార్టీ అయినా సరే పొత్తు పెట్టుకోవాలని, పక్కన కూర్చోబెట్టుకోవాలని అనుకుంటుంది. అందుకే భారతీయ జనతా పార్టీ జగన్ మీద కన్ను వేసింది. ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఆయన మద్దతును నూటికి నూరు శాతం వాడుకుంటున్న ఎన్డీయే అధికారికంగా ఆయన్ను కూటమిలో చేర్చుకుని బలం పెంచుకోవాలని చూస్తోంది. ఈమేరకు ఇటీవల సమగ్ర చర్చలు నడిచాయి కూడ.
శిరోమణీ అకాళీదళ్ లాంటి మిత్ర పక్షాలు దూరమవుతున్న నేపథ్యంలో వైసీపీని ఒడిసిపట్టి బలంగా నిలబడాలనేది బీజేపీ ప్లాన్. కానీ జగన్ లొంగటంలేదు. కేంద్ర స్థాయిలో అయితే అనధికారికంగా మద్దతు ఇచ్చినా రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అవన్నీ ఢిల్లీ స్థాయి వ్యవహారాలు కాబట్టి. అదే అధికారికంగా కలిసిపోతే రాష్ట్రంలో కూడ ఏకమైపోయినట్టే. అదే ప్రమాదం. సిదంతాల పరంగా వైసిపీకి, బీజేపీకి చాలా దూరం ఉంది. వాళ్ళు చేసే రాజకీయం వేరు జగన్ రాజకీయం వేరు. దేన్నైనా రాజకీయ కోణంలోనే చూసే అలవాటు బీజేపీది. కానీ జగన్ అలా కాదు. ఆయనకు మానవతా కోణం అనేది ఒకటుంది.
అదే తెలుగు జనాలకు విపరీతంగా నచ్చింది. అందుకే పట్టం కట్టి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. అలాంటి వ్యక్తి బీజేపీతో కలిస్తే పద్ధతులు, విధానాలు అన్నీ మార్చుకోవాలి. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ. వైసీపీనే తమ దారిలోకి తీసుకుంటుంది తప్ప జగన్ దారిలోకి అది రాదు. అప్పుడు వైసిపీ పూర్తిగా ఒరిజినాలిటీని కోల్పోతుంది. అందుకే జగన్ కలవడానికి ససేమిరా అంటున్నారు. ఆయన్ను లొంగదీసుకోడానికి బీజేపీ పెద్ద పెద్ద స్కెచ్చులు వేస్తోంది. ఆంధ్రాకు జీవనాడి లాంటి పోలవరాన్ని పొత్తులతో ముడిపెట్టిందట. తమతో కలిస్తేనే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుందని సంకేతాలు ఇస్తోందట. దీంతో పోలవరం కలను సాకారం చేసుకోవాలంటే జగన్ తన పార్టీని పణంగా పెట్టాల్సిన పరిస్థితి దాపురించింది.