వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం ఇప్పట్లో చల్లబడేలా కనిపించడదం లేదని అంటున్నారు. పవన్ క్షమాపణ చెప్పే వరకూ వదిలేది లేదని వాలంటీర్లు భీష్మించుకుని ఉన్నారని తెలుస్తుంది. దీంతో…ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలపై బీజేపీ – టీడీపీ ల స్టాండ్ ఏమిటనేది ఆసక్తిగా మారింది! వారి మౌనం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది!
అవును.. ఏపీలోని గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లపై జనసేన అధినేత తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉమన్ ట్రాఫికింగ్ కి వాలంటీర్లు సహకరిస్తున్నారని పవన్ ఆరోపించారు! దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి! పవన్ దిష్టిబొమ్మలు తగులబెట్టడాలు, ఆయన ఫోటోలను మహిళా వాలంటీర్లు చెప్పులతో తొక్కడాలు వంటి సన్నివేశాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని తెలుస్తుంది.
దీంతో పవన్ కాస్త తగ్గారని అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో కాస్త సన్నాయి నొక్కుల ధోరణి అవలంభించారనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఫలితంగా నష్ట నివారణ చర్యలకు దిగారని చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో రీషూట్ లు రీ టేక్ లు ఉండవు కదా.. ఒక సారి పబ్లిక్ డొమైన్ లోకి విషయం వెళ్లిపోయాక ఇక ప్రతిఫలాలు అనుభవించడం తప్ప మరో మార్గం లేదని పలువురు కామెంట్ చేస్తున్నారని తెలుస్తుంది.
దీంతో పవన్ వ్యాఖ్యలపై టీడీపీ మౌనాన్ని ఆశ్రయించిందని తెలుస్తుంది. ఏపీలో ఇంత రచ్చ జరుగుతున్నా.. అసలు ఏమీ జరగడం లేదన్నట్లుగా టీడీపీ నేతలంతా సైలంట్ అయిపోయారని అంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు అసలు ఈ విషయాన్ని పరిగణలోకే తీసుకోలేదని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎంత సైలంట్ గా ఉంటే తమకు వ్యక్తిగతంగా అంత మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు.
సహజంగా పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే, వెంటనే టీడీపీ నేతలు జనసేనానికి మద్దతుగా నిలుస్తుండటం గతకొంతకాలంగా జరుగుతుందనేది తెలిసిన విషయమే! అయితే అందుకు పూర్తి భిన్నంగా… వాలంటీర్ల విషయంలో మాత్రం టీడీపీ నోరు మెదపడం లేదు. దీంతో… పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తే తాము కూడా వాలంటీర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, దాని వల్ల రాజకీయంగా నష్టపోతామని టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.
పోనీ పవన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ.. వాటిని వెనక్కి తీసుకోవాలని చెబుదామంటే… అంత సాహసం చేసే పరిస్థితి ఇప్పుడు పార్టీకి లేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయని తెలుస్తుంది. దీంతో… మౌనంగా ఉండటం అంత మంచిపని మరొకటి లేదని… ఈ విషయంలో టీడీపీ మౌనాన్నే తమ బాషగా చేసుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని నిత్యం గుర్తుచేసే బీజేపీ నేతలు సైతం ఈ విషయంలో మౌనంగానే ఉండిపోయారని తెలుస్తుంది! నిఘా వర్గాలు తనకు చెప్పాయనడం ద్వారా అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారనే అభిప్రాయం బీజేపీలో ఉందని అంటున్నారు. ఫలితంగా… వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల విషయంలో బీజేపీ నేతలు సైతం పవన్ ని వెనకేసుకొచ్చే పరిస్థితి లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!
దీంతో… కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని పవన్ చెప్పినా… లేదు, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే పవన్ చదివారని వైసీపీ నేతలు విమర్శించినా… వాలంటీర్ల విషయంలో పవన్ కల్యాణ్ ఒంటరి వాడయ్యాడనే కామెంట్లు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు!