బీజేపీ + టీడీపీ + జనసేన… ఇంట్రస్ట్ ఆఫ్ ది స్టేట్?

ఒక వర్గం మీడియాలో గతకొన్ని రోజులుగా ఒక చర్చ తీవ్రంగా నడుస్తుంది. ఏదో విధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు చేస్తున్న ప్రయత్నాలు రోజు రోజుకీ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో… ఆ మూడు పార్టీలు ఇప్పుడు కొత్తగా కలవడం ఇంట్రస్ట్ ఆఫ్ ది స్టేటా.. లేక ఫ్యూచర్ ఆఫ్ దేర్ పాలిటిక్సా అన్నది ఇప్పుడు చూద్దాం…!

2014 ఎన్నికల సమయంలో టీడీపీ – బీజేపీ – జనసేనలు కలిసి పోటీచేసాయి. ఈ ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పోటీచేయనప్పటికీ… ఈ మితబృధంలో కీలక భూమిక పోషించింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. దీంతో… రాష్ట్రంలో చంద్రబాబు సీనియారిటీకి తోదు, కేంద్రంలో నరేంద్రమోడీ సిన్సియారిటీ విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రూపం అద్దుతుందని.. అభివృద్ధిలో పరుగులు పెడుతుందని అంతా భావించారు.

అయితే… అటు కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు ఎవ్వరూ ఊహించని విధంగా ఏపీకి అన్యాయం చేశారు. ఆఖర్లో ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ తమ తమ చేతికానితనాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరాన్ని బాబుకు అప్పగించారు మోడీ. ఫలితంగా ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ రూపంలో మోడీకి తాకట్టు పెట్టారు చంద్రబాబు. ఈ మధ్యలో పవన్ ఆటలో అరటిపండులా కాస్త పాచిపోయిన లడ్డులు అంటూ కాస్త కామెడీ పంచే ప్రయత్నం చేసారు! ఈ రసవత్తర రాజకీయ జూదంలో ప్రజలను ఏమార్చడంలో తనవంతు పాత్ర సక్సెస్ ఫుల్ గా నెరవేర్చారు.

ఇదొకటే కాదు… విశాఖ రైల్వే జోన్ ని అటకెక్కించారు. విభజన హామీలను తెరమరుగు చేశారు. బీజేపీ మోసం చేసిందని తమ చేతకాని తనాన్ని బాబు చెప్పుకుంటే… బాబును నమ్ముకుని మరోసారి మోసపోయామని ఏపీ బీజేపీ పెద్దలు ప్రకటించారు. వీరిద్దరి మధ్యలో… తాను మోసపోయానంటూ, ఫలితంగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా రంగంలోకి దిగుతానంటూ పవన్ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రజలు ఇవన్నీ సూక్షంగా పరిశీలించారు. తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని ఎలా కుక్కలు చింపిన విస్తరిగా చేశారనేది గ్రహించారు.

ఈలోపు 2019 సార్వత్రిక ఎన్నికలు రానే వచ్చాయి. ఆందోళనలో ఉండో.. లేక, ప్రజల ఆలోచనలు ఆ స్థాయిలోనే ఉంటాయనే చులకన భావంతోనో… ఎన్నికల ముందు పసుపూ కుంకుమా అంటూ ప్రజలకు తాయిలాలిచ్చే ప్రయత్నానికి పూనుకున్నారు చంద్రబాబు. అయితే… ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు, జనసేనకు 1 సీటు, బీజేపీ సున్నా సీట్లూ అప్పగించారు ఏపీ ప్రజానికం.

ఈ సమయంలో మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో… జగన్ పాలనలో అద్భుతాలు జరగడం లేదని, గ్రాఫిక్స్ విడుదల కావడం లేదని బూచిగా చూపిస్తూ… మళ్లీ తెరపైకి వస్తున్నారు బీజేపీ – టీడీపీ – జనసేన నేతలు. ఈ సమయంలో మరోసారి ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేయడం రాష్ట్రానికి చారిత్రక అవసరం అని చెప్పుకొస్తున్నారు. దీంతో.. ఈ మూడు పార్టీల నేతలు ఇప్పుడు మరలా కొత్తగా చెబుతున్న మాటలను, 2014 ఎన్నికల సమయంలో చెప్పిన హామీలతో పోల్చి చూసుకుంటున్న ప్రజానికం… వారి క్లారిటీలో వారున్నారు!!