2019 ఎన్నికల తరువాత దక్షిణ భారత దేశంలో జెండా ఎగరవేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీగా మారడానికి కేంద్ర బీజేపీ పెద్దలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధినేతగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణను తొలగించి సోము వీర్రాజుకు అప్పగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడిన తరువాత సోము వీర్రాజు తన మార్క్ ను చూపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన గుర్తింపును చూపించుకోవడం కోసం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి తనదైన శైలిలో సమాధానం చెప్తున్నారు. బీజేపీపై కథనాలు రాస్తున్న వారికి సమాధానాలు ఇస్తున్నారు. మొన్ననే ఆంధ్రజ్యోతి పత్రిక రాసిన కథనానికి సమాధానమిస్తూ బహిరంగ లేఖ రాశారు.
అయితే ఇప్పుడు సోముపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి నెల కూడా కాకముందే అప్పుడే ముగ్గురిని సస్పెండ్ చేశారు. వారిలో ఇద్దరినీ అన్యాయంగా సస్పెండ్ చేశారని, ఏదో సోము వీర్రాజు మార్క్ చూపించుకోవాలని ఇలా చేశాడని అధిష్టానానికి చేసిన ఫిర్యాదులో విన్నవించారట. జాతీయ పార్టీ అన్నాక నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. వాటి అన్నింటికి నోరెత్తిన వారిని సస్పెన్షన్ చేస్తానంటే పార్టీ బాగు పడదు అని కొందరు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సోము వీర్రాజు ఆవేశం తగ్గించుకోవాలని, అన్ని ప్రాంతాల నాయకులతో సఖ్యతతో ఉండి వైసీపీ, టీడీపీ లో అసమ్మతి వాళ్లను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవాలి గానీ ఎవరు ఉన్నా లేకున్నా తనికిష్టమైన మాదిరి చేస్తే 2019లో 0.84శాతం ఓటు బ్యాంకు మాత్రమే వచ్చిందని, ఈసారి అది కూడా రాదని బీజేపీ నాయకులే అనుకుంటున్నారు. ఈ ఫిర్యాదులపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.