ఎన్నికలు ముగిసే సమయం ఆసన్నమయ్యే కొద్ది భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రకటనల్లో మార్పు లొస్తున్నాయి.
ఏ పార్టీ గెలుస్తుందనేమీద వారి అంచనాలు తారు మారుఅవుతున్నట్లనిపిస్తుంది. ప్రధాని మోదీ ఎంత అట్ట హాసంగా, ప్రతిభావంతంగా ప్రచారం చేసినా వాళ్లలో బిజెపికి పూర్తి మెజారిటీ వస్తుందన్న నమ్మకం కొంత మంది సీనియర్ నేతల్లో కలగడంలేదు. అయిదేళ్ల మాంచి పరిపాలన తర్వాత కూడా 2014 రిపీట్ అవుతుందని ఎవరూ చెప్పలేకపోతున్నారు.
దీనికి రెండురోజుల కిందట బ్లూమ్ బర్గ్ పత్రికకు బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఇచ్చిన ఇంటర్వ్యూ యే సాక్ష్యం. ఆయన బిజెపికి 271 సీట్లు వస్తే సంతోషమని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అవసరమయిన సీట్లివి. ఇవి వస్తాయని ఆయన బల్ల గుద్ది చెప్పలేకపోయారు.
తర్వాత, ఎన్ డి ఎ పక్షాలతోకలసి బిజెపికి ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజారిటీ వస్తుందని అన్నారు. ఇందులో రామ్ మాధవ్ గొంత వీక్ గా ఉన్నట్లు అర్థమవుతుంది.
ఇపుడు మరొక ప్రధాన కార్యదర్శి మరొక విధంగా వ్యాఖ్యానించారు. ఈయన కూడా తెలుగు వాడే. పేరు మురళీధర రావు.
ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఫలితాల గురించి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో భారతీయజనతా పార్టీకి ఆరు స్థానాలు వస్తాయని ఆయన చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ లలో తప్పక గెలుస్తుందని, ఇవి కాకుండా మరొక రెండు చోట్ల కూడా గెలిచే అవకాశం ఉందని మురళీ ధర్ రావు చెప్పారు.
ఆంధ్రఫలితాలు మీద మాట్లాడుతూ ఆయన వైసిపి గెలుస్తుందని చెప్పినా, అక్కడ తెలుగుదేశం పార్గీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదని కూడా చెప్పారు.
ఒక పార్టీ నేతగా ఆయన తెలుగుదేశం పార్టీని పూర్తిగా తీసేయలేకపోతున్నారు.
ఏపీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందని తమ పార్టీకి సమాచారం ఉందని చెప్పారు. అయితే అదే సమయంలో ఆయన చంద్రబాబు ఎన్నికల మేనేజ్ మెంటు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని చెప్పారు.
‘ఆంధ్రప్రదేశ్ ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల కు సంబంధించి మాంచి కార్యదక్షుడు. అందువల్ల ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు,’ అని అన్నారు.
ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆయన అంచనాలు రామ్ మాధవ్ కంటే బాగా మెరుగ్గా ఉన్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి 280 నుంచ ి310 స్థానాలు వస్తాయి,’ అని అన్నారు.