వైఎస్ జగన్ వేగం ముందు ప్రత్యర్థి పార్టీలు నిలవలేకపోతున్నాయి. జగన్ చేస్తున్న సంక్షేమం మహిళల్లో ఆయనకు మంచి పేరును తీసుకొస్తోంది. ఏడాదిన్నర పాలనలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ప్రత్యర్థులకు పెద్దగా అవకాశం ఇవ్వకుండా దూసుకుపోతున్నారు ఆయన. అంతేకాదు వారిని ముచ్చెమటలు పట్టించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను వెలికితీస్తానని చూపిన ఆయన ఆ పని మీదే ఉన్నారు. ఎక్కువగా కొత్తగా రాజధాని కానున్న విశాఖ మీద ఫోకస్ పెట్టారు. అక్కడ ఏళ్ల తరబడి సాగుతున్న భూదందాలను బయటకు లాగుతున్నారు. సిట్ బృందాన్ని నియమించి విచారణ చేస్తున్నారు. త్వరలోనే అక్రమార్కుల మీద చర్యలు తప్పవని అంటున్నారు.
దీంతో రాజకీయంగా ఆయన మీద విమర్శలు ఎక్కువయ్యాయి. విశాఖలో ఉన్న విపక్షాల నేతలు నోటికి పనిచెప్పారు. తాజాగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జగన్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు. రానున్నమంత్రివర్గ విస్తరణలో భాగంగా ముఖ్యమంత్రిని కూడ మార్చాలని గొప్ప సలహా ఇచ్చేశారు. వైఎస్ జగన్ పదవి నుండి తప్పుకుని ఆయన సతీమణి వైఎస్ భారతికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని అన్నారు. ఆయన ఇలా ఎందుకు అన్నారో ఆయనకైనా తెలుసో లేదో మరి. వైఎస్ భారతి ముఖ్యమంత్రి సతీమణి కావొచ్చు. కానీ ప్రజా ప్రతినిధి కారు. ఆమె ఏ పదవిలోనూ లేరు. అలాంటి ఆమెకు సీఎం పోస్ట్ ఇచ్చేయడం ఎలా సాధ్యమని అనుకున్నారో ఏమో కానీ ఇవ్వమని చెప్పేశారు.
జనం కష్టాలను ఆమె మాత్రమే అర్థం చేసుకోగలరని, ఆమె రూల్ చేస్తే బ్రతుకులు బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయానికి కొలమానం ఏంటో మాత్రం చెప్పలేదు. అంతేనా జగన్ ను ఆంధ్రా కిమ్ అంటూ సంభోదించారు. ఇలా పొంతనలేని విమర్శలు, ఆశ్చర్యకరమైన సలహాలు ఇస్తున్న విష్ణుకుమార్ రాజుగారి ఫ్రస్ట్రేషన్ వెనుక జగన్ విశాఖలో చేపడుతున్న సీక్రెట్ ఆపరేషన్ ప్రభావం ఉందని అంటున్నారు కొందరు. జగన్ లాగుతున్న భూఅక్రమాల కూపీల్లో సదరు మాజీ ఎమ్మెల్యే లింకులేమైనా ఉన్నాయా, అందుకే ఇప్పటి నుండే జగన్ మీద విమర్శలు చేస్తూ వన్ ఫైన్ డే దొరికిపోయాక ఆనాడు నేను అలా అన్నందుకే ఈనాడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి తనను తాను సమర్థించుకోవచ్చని అనుకుంటున్నారో ఏమో మరి.