విష్ణు జోస్యం… అంతమాట అనేశారేంటబ్బా!

వాస్తవ పరిస్థితులను గ్రహించారో.. లేక, చీకట్లో బాణం వేస్తూ బెదిరిస్తున్నారో తెలియదు కానీ.. రాబోయే ఎన్నికల అనంతరం ఏపీలో ఒక ప్రాంతీయ పార్టీ ఎగిరిపోతుందని.. జెండా పీకేస్తుందని.. కనిపించకుండా పోతుందని జోస్యం చెబుతున్నారు ఏపీ బీజేపీ నేత.. విష్ణువర్ధన్ రెడ్డి. దీంతో… ఆయన ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేశారు.. ఏ పార్టీని దృష్టిలో పెట్టుకుని అన్నారు అన్నది ఆసక్తిగా మారింది.

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలకూ అత్యంత కీలకం. ఈసారి కూడా బలంగా అధికారంలోకి వస్తే.. ఇక పాతుకుపోవచ్చని అధికార వైసీపీ భావిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే… వైనాట్ 175 అంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం 151 సీట్లతో అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. ఆ సంగతి అలా ఉంటే… ఇక టీడీపీ విషయానికొద్దాం.

2019 ఎన్నికల ఫలితాల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితి టీడీపీది! ఎంతో బలమైన పార్టీగా చెప్పుకునే టీడీపీ 175 సీట్లలో కేవలం 23 మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల అనంతరం జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా చతికిలపడిపోయిన పరిస్థితి. అయితే తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త తేరుకుని, మళ్లీ జవసత్వాలు తెచ్చుకుని.. జనాల్లో తిరుగుతుంది.

ఇక జనసేన విషయానికొస్తే… పార్టీ స్థాపించి పదేళ్లైనా ఇప్పటికీ అధినేత ఎమ్మెల్యే కాలేకపోయారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఎక్కడి నుంచి పోటీచేస్తారో, ఎన్ని సీట్లలో పోటీచేస్తారో తెలియని పరిస్థితి. అయితే.. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి… విష్ణు మాటలు జనసేన గురించి కాదా అనే అనుమానం వస్తుంది!

అవును… పైన చెప్పుకున్న తాజా పరిస్థితుల దృష్ట్యా విష్ణు చెప్పిన జోస్యం… అయితే టీడీపీ – లేకపోతే జనసేన గురించే అయ్యుండాలి. అయితే… బీజేపీతో పొత్తు కోసం ప్రాకులాడుతున్న టీడీపీ గురించే విష్ణు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కొందరంటుంటే… పైకి పొత్తులో ఉన్నా ఒక్క ఎన్నికల్లోనూ బీజేపీకి సహకరించకుండా వెన్నుపోటు పొడుస్తున్న జనసేన గురించే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరి విష్ణు జోస్యం నిజమవుతుందా..? 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో ఒక పార్టీ కనుమరుగైపోతుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి! అయినా… విష్ణుకి ఈ రేంజ్ లో కోపం ఎవరిపై ఉందబ్బా…??