విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. బీజేపీ-జనసేన పార్టీలు పిలుపునిచ్చిన ఛలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఛలో రామతీర్థానికి బయలుదేరిన బీజేపీ జనసేన నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇక రామతీర్థం వెళ్లేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును రామతీర్థం జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యక్రతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
బీజేపీ కార్యకర్తులు భారీగా తరలిరావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రామతీర్థంలో సెక్షన్ 30 అమల్లో ఉండటంతో ర్యాలీకి అనుమతించమని పోలీసులు చెప్పడంతో సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే విశాఖలో ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు.
ఐతే తమను రామతీర్థం వెళ్లకుండా అడ్డుకోవడంపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డి, మంత్రులను కొండపైకి పంపిన పోలీసులు తమనెందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. బీజేపీ, జనసేన పార్టీలు శాంతియుతంగా చేపట్టిన ధర్మయాత్రను పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు