ఏపీ రాజకీయాలపై వ్యూహం మార్చనున్న బీజేపీ.?

‘వైసీపీకి బీ-టీమ్’ అనే ఆరోపణల్ని ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీజేపీ గట్టిగా ఎదుర్కొంది. ఎందుకిలా.? ఎవరు చేశారు ఈ దుష్ప్రచారాన్ని.? అంటూ బీజేపీలో మల్లగుల్లాలు జరుగుతున్నాయ్. బీజేపీ నేతలే ఈ వ్యవహారంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. మాధవ్ ఇంకోసారి ఎమ్మెల్సీ అవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు.

జనసేన గనుక గట్టిగా మద్దతిచ్చి వుంటే, ఓడిపోయినా.. పరువు నిలబడేదన్నది బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ‘తిరుపతిలో మద్దతిచ్చాం.. కానీ, బీజేపీ వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించలేదు’ అని జనసేనాని స్వయంగా మొన్నటి మచిలీపట్నం బహిరంగ సభలో అసలు విషయాన్ని కుండబద్దలుగొట్టేశారు.

ఇప్పుడిక బీజేపీకి ఇంకో ఆప్షన్ లేదు. టీడీపీతో జతకట్టాల్సిందే. మిత్రపక్షం జనసేనతో వున్న గ్యాప్ తగ్గించుకోవాల్సిందే. ‘అసలు మేమేంటి.? వైసీపీకి బీ-టీమ్‌గా వ్యవహరించడమేంటి.?’ అని తలపట్టుక్కూర్చునే పరిస్థితి బీజేపీకి రావడానికి కారణం, ఢిల్లీ స్థాయిలో బీజేపీ – వైసీపీ మధ్యన వున్న సఖ్యతే.

కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అన్న కోణంలోనే కాదు, ఢిల్లీ బీజేపీతో వైసీపీ అధినాయకత్వం సఖ్యతగానే వుంటోందన్నది బహిరంగ రహస్యం. కాగా, ఈ పరిస్థితుల్లో బీజేపీని కలుపుకుపోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని అటు జనసేన, ఇటు టీడీపీ అనుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా జనసేన, టీడీపీ శ్రేణులు ఇదే తీరుగా చర్చించుకుంటుండడం గమనార్హం.

వాస్తవానికి బీజేపీకి ఏపీలో స్థానం లేదు. ఆ విషయం కమలం పార్టీలో అందరికీ తెలుసు. కానీ, కేంద్రంలో అధికారం తమదే కాబట్టి.. అన్న అహంకారం.. వాపుని చూసి బలుపు అనుకోవడం.. వెరసి, ఏపీలో కమలం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు వ్యూహం మార్చుకుని లాభం లేదు. బీజేపీ అంటరాని పార్టీ అయిపోయిందిప్పుడు.!