ఏ రాష్ర్టంలో ప్రభుత్వం బలహీనంగా ఉంటే ఆ రాష్ర్టంలో కర్చీప్ వేయడం అనేది బీజేపీ వ్యూహం. దేశం మొత్తం ఎంత వీలైనంత కమలం గుభాళింపే ఉండాలని పావులు కదుపుతోంది. సరిగ్గా అదును చూసి జెండా పాతేయడం అన్నది మోదీ-షాల వ్యూహం. వాళ్ల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ముందుకు కదలుతుంటారు. సమయం..సందర్భం..అవసరం ఇలా అన్నింటిని పక్కాగా లెక్కలు వేసుకుని మాటేసి చుట్టేయడమే బీజేపీ చివరిగా చేసేది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో అలాంటి వ్యూహంతోనే కమలనాధులు ముందుకెళ్తున్నారు. అందులో తెలంగాణ రాష్ర్టం కూడా ఉంది. అయితే ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యపడదు.
మిత్రపక్షం జనసేన కుడిభుజంలా ఉన్నా ఆ పార్టీ కి ఉంది ఒకే ఒక్క ఎమ్మెల్యే. అతను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట వినడు. రాజీనామా చేయలేదు గానీ, అసెంబ్లీ కి వెళ్లిన దగ్గర నుంచి వైకాపాకే మద్దతు తెలుపుతున్నాడు. ఆ పార్టీ నేతలతో మింగిలైపోయాడు . టీడీపీతో బీజేపీ ముందే చెడింది. ఈ నేపథ్యంలో ఎలా చూసినా ఏపీ ప్రజల్లో బలంగా ఉన్న ఒకే ఒక్క పార్టీ వైసీపీ. ఈ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎలా ఉంటుందో? బీజేపీ మాజీ సారథి కన్నా లక్ష్మీనారయణ ఎగ్జిట్ ని బట్టే తేలిపోయింది. మూడు రాజధానులను వ్యతిరేకించడం..దానికి సంబంధించి గవర్నర్ కి అదిష్టానం అనుమతి లేకుండా లేఖ రాసి బుక్కవడం. ఆ వెంటనే ఆ స్థానాన్ని సోము వీర్రాజుతో భర్తీ చేయడం జరిగింది.
ఈయన ప్రభుత్వం విషయంలో కర్ర విరగకూడదు..పాము చావకూడదు అన్నట్లే మాట్లాడుతున్నారు. వచ్చిరాగానే టీడీపీని టార్గెట్ చేసారు తప్ప జగన్ జోలికి వచ్చినా పై పైన టచ్ చేసి జారుకున్నారు. ఇక బీజేపీ జాతీయ శారథి జేపీ నడ్డా తాజాగా కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు తప్ప ఏపీ జోలికి రాలేదు. వాస్తవానికి ఏపీ సర్కార్ కరోనా పరీక్షల్లో మాట దాట వేస్తుంది. కానీ ఆయన ఏపీని టచ్ చేయలేదు. కారణమేమంటే? భవిష్యత్ లో జగన్ అవసరం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎంతైనా ఉంటుందనే ఇలా మౌనం దాల్చుతున్నారన్నది ఇన్ సైడ్ టాక్. అందుకోసమే బీజేపీ జగన్ తోనూ సీక్రెట్ స్నేహాన్ని నెరుపుతోంది అన్న వాదన వినిపిస్తోంది.