రాష్ట్రంలోని బలమైన సామాజికవర్గాల్లో కాపు సామాజికవర్గం కూడ ఒకటి. భారీ సంఖ్యలో ఓటు బ్యాంకు ఉన్నా కూడ ఇప్పటి వరకు రాజ్యాధికారం దక్కలేదనే బాధ ఈ వర్గంలో పుష్కలంగా ఉంది. అయితే రెడ్డి వర్గం లేకపోతే కమ్మ వర్గమే రాజ్యం చేస్తుండటంతో కాపులు అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా తమకు ప్రాతినిథ్యం వహించే బలమైన నేత లేకపోవడంతో పరిస్థితుల్లో వేరొక వర్గానికి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇతర పార్టీలు సైతం వీరి ఓటు బ్యాంకు ప్రాధాన్యతను గుర్తించి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. ఎన్ని చేసినా కాపులకు రిజర్వేషన్లు మాత్రం తీసుకురాలేకున్నారు. అందుకే బలమైన అండను కోరుకుంటున్నారు. ఆ పార్టీలో పెత్తనం కాపులదే అయ్యుండాలని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీచేసినప్పటికీ పార్టీ స్థాయిలో కాపుల ఓట్లను కొల్లగొట్టలేకపోయారు ఆయన. అప్పుడున్న పరిస్థితుల కారణంగా టీడీపీ, వైసీపీల మధ్యన కూడ కాపు ఓట్లు చీలిపోయాయి. అలా విభజింపబడకుండా ఒక పార్టీకే కాపులు పరిమితమైతే వారి ప్రభావం గట్టిగానే ఉంటుంది. బీజేపీ దృష్టి మొత్తం ఈ సమీకరణం మీదనే ఉంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కాపు వర్గానికి చెందినవారే. కన్నా లక్ష్మీనారాయణ తరహాలో ఆయన టీడీపీకి వత్తాసు పలకట్లేదు కాబట్టి కాపులు మెల్లగా ఆయన్ను నమ్మడం స్టార్ట్ చేశారు. అయితే అదింకా ప్రారంభ దశలోనే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాపులు ఎక్కువగా వీరి వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.
అయితే అధికారం చేపట్టాలన్నా, కనీసం ప్రతిపక్ష హోదా దక్కాలన్నా ఈ బలం సరిపోదు. అందుకే బీజేపీ కన్ను ఇంకొకరి మీద పడింది., ఆయనే ముద్రగడ పద్మనాభం. ఏళ్ల తరబడి కాపు ఉద్యమాన్ని నడిపిన ఆయన ఇటీవల సైలెంట్ అయిపోయారు. ఉద్యమ మూలాన ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయానని ఇకపై ఉద్యమ భారాన్ని మోసే శక్తి తనకు లేదని విరమించుకున్నారు. ఆయన ఉద్యమాన్ని వీడటంతో ఆయన్ను పార్టీలోకి లాగాలని చాలామంది ట్రై చేశారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగింది. ముద్రగడ మీద బలంగా వల పన్నుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను పార్టీలోకి తీసుకురావాలని అప్పుడే బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందనే భావనతో ఉన్నారు.
ఇప్పటికే ఆయన్ను సంప్రదించే కార్యక్రమాలు కూడ మొదలయ్యాయట. పార్టీలోకి వస్తే మంచి ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారట. ఎలాగైనా తిరుపతి ఉప ఎన్నికల నాటికి ఆయన్ను పార్టీలోకి తీసుకువస్తే తిరుపతిలో ప్రచారం కూడ చేయించాలని చూస్తున్నారు. మరోవైపు టీడీపీకి కూడ ముద్రగడ మీద ఆశ ఉంది. ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే గత ఎన్నికల్లో కోల్పోయిన కాపు ఓట్లను తిరిగి నిలబెట్టుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. మరి రెండు పార్టీలు వేస్తున్న గాలాల్లో ముద్రగడ దేనికి పడతారో చూడాలి.