తెలుగు రాష్ట్రాల్లో బిజెపి డేంజరస్ ప్లాన్

తెలుగురాష్ట్రాల్లో బలపడేందుకు బిజెపి డేంజరస్ ప్లాన్ మొదలుపెట్టినట్లే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణాలో మంచి దూకుడు మీదుంది. అలాగే ఏపిలో కూడా గణనీయమైన స్ధానాలు గెలుచుకునేందుకు గట్టి నిర్ణయాలతోనే ముందుకు సాగుతోంది.

తెలంగాణా విషయాన్ని తీసుకుంటే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా బిజెపి నాలుగు స్ధానాలు గెలుచుకున్నది. దాంతో కమలం పార్టీని పట్టటం కష్టంగా ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టిడిపిలను నాసినం చేసేయాలని కెసియార్ వేసిన ప్లాన్ ఇపుడాయన మెడకే చుట్టుకుంటోంది. కెసియార్ అనుకున్నట్లే కాంగ్రెస్, టిడిపిలను చీల్చి చెండాతున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్, టిడిపి బలహీనమైపోయాయో వెంటనే ప్రత్యామ్నాయం కోసం జనాలు బిజెపి వైపు మొగ్గుచూపారు.

కెసియార్ గనుక కాంగ్రెస్, టిడిపిల జోలికి వెళ్ళకుండా ఉండుంటే జనాలు బిజెపిని పట్టించుకునే వారు కాదన్నది వాస్తవం. నిజానికి కాంగ్రెస్, టిడిపిలకన్నా బిజెపి ప్రమాదకరమైన పార్టీ అన్న విషయం కెసియార్ మరచిపోయి తప్పుచేశారు. మొన్న అసెంబ్లీ ఆమోదించిన మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ తిప్పి పంపారు. సో ఇపుడు కెసియార్ ను నియంత్రించేందుకు బిజెపి గవర్నర్ ను ఉపయోగంచుకుంటోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అదే విధంగా ఏపిలో కూడా జగన్ కు వ్యతిరేకంగా బిజెపి విరుచుకుపడుతోంది. కమలం పార్టీలోని రాష్ట్రస్ధాయి నేతల్లో ఎక్కువమంది జగన్ టార్గెట్ గా ఆరోపణలు, విమర్శలు చేయటం జాతీయ పార్టీ డైరెక్షన్ మేరకే నడుచుకుటుంన్నారన్న విషయం అర్దమైపోతోంది. జగన్ పై ఉన్న కేసుల విచారణ గురించి ఏపి ఇన్చార్జి సునీల్ థియోధర్ తాజాగా ప్రస్తావించటమే ఇందుకు నిదర్శనం.

టిడిపి ఎంఎల్ఏలు తమ పార్టీలోకి ఫిరాయించటానికి జగనే అడ్డుపడుతున్నారనే కోపంతో జాతీయ నాయకత్వం మండిపోతోంది. వచ్చే ఎన్నికలకు రెండు రాష్ట్రాల్లోను బలపడాలన్న ఉద్దేశ్యంతోనే అందుబాటులో వ్యవస్ధలను ఉపయోగించుకోవాలని బిజెపి డిసైడ్ అయినట్లే కనిపిస్తోంది.