వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు.. అన్న ఒక్క అంశం చుట్టూ జనసేనాని ఎందుకు రాజకీయం చేస్తున్నారు.? 2019 ఎన్నికల సమయంలోనూ ‘వైసీపీని అధికారంలోకి రానివ్వను’ అంటూ నినదించారు పవన్ కళ్యాణ్. కానీ, ఏం జరిగింది.? దాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అంటోన్న పవన్ కళ్యాణ్ మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
కానీ, బీజేపీ పరిస్థితి వేరు. తెలంగాణలో బలపడినట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడలేకపోతోంది. వైసీపీ, టీడీపీ, జనసేన.. ఆ తర్వాత బీజేపీ.! అంతే తప్ప, వైసీపీ – టీడీపీ మధ్యలోకి బీజేపీ వచ్చే పరిస్థితి లేదు.. కనీసం జనసేన కంటే కాస్తన్నా ఎదిగే అవకాశమూ బీజేపీకి లేదు. టీడీపీని ఆల్రెడీ రెండు సార్లు నమ్మి మోసపోయామన్న భావన బీజేపీలో వుంది. వైసీపీని నమ్మి ఏం ప్రయోజనం.? అని కూడా బీజేపీ అనుకుంటోంది.
ఈ పరిస్థితుల్లో జనసేనతో కలిస్తేనే కాస్తో కూస్తో ప్రయోజనమన్నది బీజేపీ భావన. అయితే, ఏపీ బీజేపీ వేరు.. బీజేపీ కేంద్ర నాయకత్వం వేరు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. తెలంగాణ బీజేపీకి, బీజేపీ అధినాయకత్వం మద్దతుంది. ఏపీలో అయితే బీజేపీ నాయకుల్ని కేంద్ర నాయకత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. అసలు ఏపీతో తమకేమీ సంబంధం లేదన్నట్టు కూడా బీజేపీ అధినాయకత్వం వ్యవహరిస్తోంది.
అందుకే, జనసేనాని.. ‘తాడో పేడో తేల్చుకుంటాం’ అన్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు ఏపీ బీజేపీకి, బీజేపీ జాతీయ నాయకత్వానికీ. దీనివల్ల జనసేనానికి వచ్చే రాజకీయ లాభమేంటి.? అదో మిలియన్ డాలర్ క్వశ్చన్. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు తయారైంది పరిస్థితి.
