టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీలోనే తిరుగుబాటా? చంద్రబాబు పై ఆ సీనియర్ అంత సీరియస్ గా ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. రాష్ర్టానికి కరోనా సోకిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కే పరిమితమై జూమ్ యాప్ లోనే రాజకీయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహానాడు సమయంలో అమరావతికి వచ్చి ఆ కార్యక్రమం ముగించికుని తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. విశాఖ గ్యాస్ బాధితుల్ని సైతం పరామర్శించకుండా మహానాడులోనే మృతి చెందిన కుటుంబానికి 50 వేల ఆర్ధిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది లేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయాలపై సొంత నేతలే లోలోపల రగిలిపోయారు. ఇదేం చోద్యం అన్నట్లు అసంతృప్తిని లోలోపలే దిగమింగుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు చంద్రబాబు జూమ్ రాజకీయా లపై తీవ్ర అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించినంత పనిచేసారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన కీలక సమావేశంలో బాబు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. చంద్రబాబు తీరును అయ్యన్న తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా జూమ్ లో భేటీలేంటని మండిపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
హైదరాబాద్ కే పరిమితం కావడం కరెక్ట్ కాదని..అప్పుడప్పుడైనా అమరావతి వచ్చి పరిస్థితులు సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయ్యన్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. నెలల తరబడి హైదరాబాద్ లోనే ఉంటే ఆంధ్రరాష్ర్ట ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించరా? అని హితవు పలికారుట. కరోనా ఉందని ఇలాగే ఉంటే పార్టీ భవిష్యత్ తారుమారవుతుందని..వీలైంనత త్వరగా బలోపేతం కోసం అందరూ కృషి చేయాలని అయ్యన్న సూచించారుట. అలాగే రాష్ర్టంలో 13 జిల్లాల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? అన్న దానిపై కూడా చర్చించారుట. అన్ని నియోజక వర్గాల వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయ్యన్న పెద్దరికం ఇప్పుడు పార్టీకి బాగానే పనికొస్తుంది.