వైఎస్సార్సీపీకి అతి పెద్ద డ్యామేజీ ఇది.!

పార్టీ ఆవిర్భవించకముందు నుంచీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, కొత్త పార్టీ పెట్టడం.. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి దూకడం.. ఇలా చాలా పెద్ద కథే నడిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, వైసీపీ ఎంపీనే ‘రెబల్’గా మారడం వైసీపీకి అతి పెద్ద దెబ్బ. కానీ, ఇప్పుడు అంతకు మించిన ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్ ధిక్కరించి మరీ, టీడీపీకి ఓటేశారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో. ఇది వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్సలేమాత్రం ఊహించని విషయం.!

పంచమర్తి అనురాధ గెలవడం కాదు.. వైసీపీ ఓడిపోయింది.! ఔను, వైసీపీ ఆరు గెలవగా, టీడీపీ ఒక్కటి గెలిచినా.. వైసీపీ కూడా టీడీపీ గెలుపు గురించే మాట్లాడుతోంది. ‘చంద్రబాబు మా ఎమ్మెల్యేలను కొనేశారు’ అంటూ వైసీపీ ఎంపీ భరత్ మీడియా ముందు అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇది కాదు.. వైసీపీ చేయాల్సింది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే వైసీపీలో ‘వెన్నుపోటుదారుల్ని’ వైసీపీ గుర్తించి వుండాలి. ఇప్పుడేమో, కోవర్టుల బలం మరింత పెరుగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీది నిజానికి పెద్ద గెలుపేమీ కాదు. కానీ, వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటేయడం.. వైసీపీకి చావు దెబ్బే.!

డ్యామేజ్ కంట్రోల్ ఎలా.? అని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. బటన్ నొక్కి సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడమే కాదు, కనుసైగతో పార్టీ నేతల్ని తన అదుపాజ్ఞల్లో వుంచుకోవడంపై దృష్టిపెట్టాలి.