జనసేనకు ఎక్కువ నష్టం వైసీపీతో కాదు, జనసేనతోనే.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే.! ఆ క్రమంలోనే ప్యాకేజీ స్టార్ అనే విమర్శ జనసేనాని పవన్ కళ్యాణ్ మీద వైసీపీ చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుని దత్త తండ్రిగా, జనసేన అధినేతని దత్త పుత్రుడిగా వైసీపీ విమర్శించడం మామూలే.

ఇంతవరకు ‘నేను దత్త తండ్రిని కాదు.. నేను జనసేనకి ప్యాకేజీ ఇవ్వలేదు..’ అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎప్పుడూ చెప్పలేదు. కాస్త వెనక్కి వెళ్ఫి చూస్తే, ‘దత్త పుత్రుడు’ అన్న విమర్శ మొట్ట మొదట చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్.

అప్పట్లో, ప్రధాని నరేంద్ర మోడీకి దత్త పుత్రుడిగా పవన్ కళ్యాణ్‌ని అభివర్ణించారు నారా లోకేష్. ఆ విమర్శనే, ఆ తర్వాత వైసీపీ కొనసాగించడం మొదలు పెట్టింది. ఉధృతంగా ఆ విమర్శని జనసేన మీద చేస్తూ వస్తోంది.

జనసేన – టీడీపీ కలిసి పోటీ చేయాలని టీడీపీ భావిస్తున్నప్పుడు, మిత్రపక్షంలా భావించాల్సిన జనసేన మీద వైసీపీ చేస్తున్న విమర్శల్ని ఖండించాలి. కానీ, ఖండించడంలేదు. ఈ విషయమై జనసేన నేతలు కొందరు పదే పదే, టీడీపీని సోషల్ మీడియా వేదికగానూ, న్యూస్ ఛానళ్ళ చర్చా కార్యక్రమాల్లోనూ నిలదీస్తూనే వున్నారు.

టీడీపీ – జనసేన పొత్తు కుదిరినా, టీడీపీకి జనసేన ఓట్లు పడతాయేమో.. జనసేనకి మాత్రం టీడీపీ నుంచి ఒక్క ఓటు కూడా పడకూదంటూ టీడీపీ శ్రేణులు కింది స్థాయిలో నినదిస్తున్నారు. క్యాడర్‌కి స్పష్టమైన సంకేతాలూ పంపుతున్నారు.

‘మీరెప్పటికీ మాకు శతృవులే..’ అంటూ కాపు సామాజిక వర్గంపై, కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు, జనసేనని మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ‘ఇంత జరిగినా, చంద్రబాబు సరిగ్గా స్పందించడంలేదు. కానీ, టీడీపీతో కలిసి వెళతామని జనసేనాని అంటున్నారు.. ఇది కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకుని తాకట్టు పెట్టడమే’ అన్నది జనసేన మద్దతుదారులైన కాపు సామాజిక వర్గ ఓటర్ల ఆవేదన.

ఎలా చూసినా, వైసీపీ కారణంగా జరిగే నష్టం కంటే, జనసేన పార్టీకి టీడీపీ వల్ల జరిగే నష్టమే ఎక్కువ.!