పరిటాల ఫ్యామిలీకి భారీ షాక్: వైసీపీలోకి ముఖ్య అనుచరుడు

ఆంధ్రా పాలిటిక్స్ లో పరిటాల ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిటాల కుటుంబం గురించి తెలియనివారుండరు. అభిమానించే వారితోపాటు పరిటాల వ్యతిరేకులు కూడా ఉన్నారనడంలో సందేహం లేదు. పరిటాల రవి హత్య తర్వాత రాజకీయ బాధ్యతలు ఆయన భార్య పరిటాల సునీత తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె టీడీపీ మంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో వారి వారసుడు పరిటా శ్రీరామ్ ని ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు, ముఖ్య అనుచరుడు పరిటాల కుటుంబానికి వ్యతిరేకంగా వైసీపీలో చేరనున్నారు అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వివరాలు కింద ఉన్నాయి చదవండి.

పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనాదిగా వారి కుటుంబానికి అండగా ఉన్న అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారి సమీప బంధువులకు, వారి వర్గం వారికి ప్రాముఖ్యం ఇస్తున్నారని వాదన వినిపిస్తోంది. వారి బంధువుల దౌర్జన్యం ఎక్కువ అవడం వలన పరిటాల అనుచరులు ఒక్కొక్కరిగా వారికి దూరం అవుతూ వస్తున్నారని టాక్. అయితే పరిటాల ఫ్యామిలీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారి వెన్నంటే ఉన్నవారిని ఇప్పుడు ఆ కుటుంబం చిన్నచూపు చూస్తోందని, ఈ కారణంతోనే పరిటాల రవి ముఖ్య అనుచరుడు, టీడీపీ సీనియర్ లీడర్ వేపకుంట రాజన్న వారికి దూరం అవ్వాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులవద్ద చర్చించినట్టు సమాచారం.

పరిటాల పెత్తందారుల దౌర్జన్యాలతో, దోపిడీలతో రాప్తాడు ప్రజలు విసిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెపుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారట. ఇక త్వరలో ఆయన టీడీపీని వీడి తన అనుచరవర్గంతో వైసీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజన్న పరిటాల కుటుంబంతోపాటు, టీడీపీ కుటుంబాన్ని కూడా వీడటం లోకల్ గా పరిటాల కుటుంబానికి, టీడీపీకి మింగుడుపడని విషయమే. అసలు పరిటాల కుటుంబానికి, వైసీపీకి పచ్చిగడ్డి వేసినా భగ్గుమనేంత వైరం ఉంది. అటువంటిది పరిటాల రవి అత్యంత సన్నిహితుడు వైసీపీ కండువా కప్పుకోవడం షాకింగ్ పరిణామం. రాజన్న వర్గీయులు కూడా పార్టీని వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు.

అయితే ఎప్పటి నుండో అనంతపురంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి అనుకుంటోంది వైసీపీ అధిష్టానం. టీడీపీ కంచుకోటగా ఉంది అనంతపురం జిల్లా. ఈ జిల్లాకు బీసీల జిల్లాగా పేరుంది. కానీ ఆధిపత్యం మాత్రం రెండు పెద్ద కుటుంబాలది అనేది జనలమాట. ఆ రెండు కుటుంబాలు ఒకటి జేసీ ఫ్యామిలీ, మరొకటి పరిటాల ఫ్యామిలీ. మరి అనంతపురంలో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు టీడీపీ కంచుకోటకి బీటలు వారుతున్నాయి అనిపించేలా ఉన్నాయి.

జేసీ వర్గానికి, చౌదరి వర్గానికి అస్సలు పడట్లేదు. ఆయన డైరెక్టుగానే కమ్మోది పెత్తనం ఏంటని అందరిముందు నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. కదిరి సిఐ వివాదంతో మరికొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు జేసీ. అదే అదునుగా చూసుకుని ఆయనకు ధీటుగా సిఐ గోరంట్ల మాధవ్ ని ఎన్నికల బరిలో దింపేందుకు సిద్ధమయ్యారు వైసీపీ నాయకులు. ఆయన పోటీ చేస్తే ఇటు పోలీసు వర్గం, బీసీ వర్గీయుల మద్దతు ఇవ్వకుండాపోదు. ఇక పరిటాల కుటుంబం విషయానికి వస్తే ముఖ్య అనుచరులే వారిని వీడడం చర్చనీయాంశమే. పరిటాల కుటుంబం ఇమేజ్ ని డౌన్ చేసే ఛాన్స్ లేకపోలేదు. కంచుకోటలో టీడీపీ మెజారిటీ పుంజుకుంటుందో, తగ్గుతుందో ఎన్నికలే తేల్చాలి.