షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబునాయుడుకు భారీ షాక్ తగులుతోంది. ఉత్తరాంధ్రలోని కీలకమైన విశాఖపట్నం జిల్లాలో టిడిపి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయటానికి రంగం సిద్ధమైంది. ప్రధానంగా అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ తో పాటు మరో ఆరుగురు రాజీనామాకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈరోజు లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అవ్వటానికి అవంతి హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. అవంతి వైసిపిలో చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలోని ఆరుగురు ప్రజా ప్రతినిధులు చంద్రబాబుతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదట.
అవంతితో పాటు మరికొందరు ఎంఎల్ఏలు టిడిపికి వీడుతున్నారన్న విషయం బయటకు పొక్కటంతో ఉత్తరాంధ్రలోనే కాకుండా మొత్తం టిడిపిలోనే కలకలం మొదలైంది. దాంతో స్వయంగా చంద్రబాబే అవంతి తదితరులతో మాట్లాడేందుకు ఫోన్ చేసినా ఎవరూ అందుబాటలోకి రావటం లేదట. దాంతో టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అవంతి టిడిపికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకోవటంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో తలెత్తిన విభేదాలు కారణమని సమాచారం.
వచ్చే ఎన్నికల్లో అవంతి భీమిలీ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఆ సీటులో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి తనను కాదని అవంతికి టికెట్ ఇచ్చేందుకు లేదని గంటా కూడా పట్టుబట్టారు. ఆ విషయమం మీదే చాలాకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఇదే విషయమై చంద్రబాబు పంచాయితీ చేయటానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దాంతో విశాఖ జిల్లాలో టిడిపి గంటా, అవంతి గ్రూపులుగా విడిపోయాయి.
ఎప్పుడైతే రెండు గ్రూపులు మొదలయ్యాయో వివాదాలు రోడ్డున పడ్డాయి. దాంతో టిడిపిలో ఉండటం సాధ్యం కాదని అవంతి గ్రూపుకు అర్ధమైపోయింది. వెంటనే జగన్ తో టచ్ లోకి అవంతి వెళ్ళారు. జగన్ కూడా సానుకూలంగా స్పందించటంతో ఈరోజు భేటీ అవుతున్నారట. అవంతికి భీమిలి టికెట్ ఇవ్వటానికి జగన్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అదే నిజమైతే టిడిపికి విశాఖపట్నం జిల్లాలో భారీ కుదుపు తప్పదు. మరి అవంతితో పాటు టిడిపికి రాజీనామా చేసే ప్రజా ప్రతినిధులెవరో తెలియాల్సుంది.