వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తిరుపతి వైసిపి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ భూమన ఈ ప్రకటన చేశారు. హఠాత్తుగా భూమన ఈ ప్రకటన చేయటం వెనుక కారణాలైతే స్పష్టంగా తెలియలేదు. నిజానికి మొన్నటి ఎన్నికల్లోనే టిడిపి అభ్యర్ధి సుగుణమ్మపై అతికష్టం మీద భూమన గెలిచారు.
వైసిపి తరపున పోటీ చేసిన చాలామందికి 35 వేల నుండి 80 వేల మధ్యలో మెజారిటీలు వస్తే కరుణకు కేవలం 780 ఓట్లు మాత్రమే మెజారిటీ రవాటం గమనార్హం. భూమనపై మామూలు జనాల్లోనే కాదు పార్టీలో కూడా బాగా వ్యతిరేకత ఉందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ కు తిరుపతిలో భూమన అత్యంత సన్నిహితుడు కావటంతో టికెట్ కోసం పెద్దగా ఎవరూ పోటీకి రాలేదు. దాంతో భూమనకే జగన్ టికెట్ కేటాయించారు.
భూమనపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతంతా ఓటింగ్ సమయంలో బయటపడింది. ఎప్పుడు చూసినా జగన్ పక్కనే కనబడే భూమనకు పార్టీలోని నేతలు, శ్రేణులతో మాత్రం సరైన సంబంధాలు లేవని అంటారు. అందరినీ దూరంగా పెట్టిన కారణంగా భూమన గెలుపు కోసం పార్టీలో ఎవరూ మనస్పూర్తిగా పనిచేయలేదు. దాని ఫలితమే చావు తప్పి కన్ను లొట్ట బోయినట్లు 780 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.
సరే ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని చెప్పటం వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అని అనుమానిస్తున్నారు. 8వ తేదీ మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది లేదని అంటే మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందని భూమన పెద్ద ఎత్తే వేశారని పార్టీలో చర్చ మొదలైంది. పరోక్షంగా మంత్రివర్గంలో చోటు కోసం జగన్ కు భూమన సంకేతాలు పంపారనే అనుమానాలు కూడా వినబడుతున్నాయి. మరి భూమన మనసులో ఏముందో తొందరలోనే తెలుస్తుంది లేండి.