తిరుపతి ఎంఎల్ఏకి షాక్ ఇచ్చిన టిడిపి నేతలు

అవును మీరు చదివింది కరెక్టే. తిరుపతి ఎంఎల్ఏకి టిడిపి నేతలు షాక్ ఇవ్వటమేంటని అనుకుంటున్నారా ? తిరుపతి ఎంఎల్ఏ సుగణమ్మ కూడా టిడిపి ఎంఎల్ఏనే. అంటే అధికారపార్టీ ఎంఎల్ఏకి అధికార పార్టీ నేతలే పెద్ద షాక్ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే, తిరుపతి టిడిపి ఎంఎల్ఏ సుగుణమ్మపై పార్టీలో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది. ఎంఎల్ఏ వ్యవహార శైలి కావచ్చు, అవినీతి ఆరోపణలు కావచ్చు లేదా పార్టీ నేతలతో ఆమెకున్న సంబంధాలు కావచ్చు. మొత్తం మీద ఎంఎల్ఏపై నేతలందరూ పూర్తిగా వ్యతిరేకమైపోయారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సుగుణమ్మకే గనుక టిక్కెట్టిస్తే ప్రత్యర్ధులకు తిరుపతి నియోజకవర్గాన్ని పళ్ళెంలో పెట్టి అందించినట్లే అని చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు.

 

సరే నేతలు ఫిర్యాదు చేశారనో లేకపోతే తాను తెప్పించుకుంటున్న సమాచారం ఆధారంగానో చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడును ప్రత్యేకంగా జిల్లాకు పంపారు. మంత్రితో సమావేశమైన తిరుపతి నేతలందరూ ఒక్కసారిగా ఎంఎల్ఏపై మండిపోయారు. ఎంఎల్ఏపై ఉన్న ఆరోపణలు, ఆమె వ్యవహారశైలి, నేతలను ఆమెను పట్టించుకోకపోవటం లాంటి అనేక అంశాలపై మండిపడ్డారు. ఇదంతా ఎంఎల్ఏ ఎదురుగానే సుమా. సరే తనపై నేతలు మూకుమ్మడిగా ఆరోపణలతో దాడి చేసిన తర్వాత ఎంఎల్ఏ ఊరుకుంటారా ? నేతలపై ఎంఎల్ఏ కూడా ఆరోపణలు చేశారు. అయితే ఆమె చేసిన ఆరోపణలు తేలిపోయాయనుకోండి అది వేరే సంగతి. దాంతో అచ్చెన్నకు విషయం అర్ధమైపోయింది.

 

తిరుపతి నుండి చిత్తూరుకు వెళ్ళిన అచ్చెన్న అక్కడ కూడా నేతలతో సమావేశమయ్యారు. అక్కడ కూడా ఎంఎల్ఏపై నేతలు ఫిర్యాదులు చేశారు. చిత్తూరు ఎంఎల్ఏ డికె సత్యప్రభ నేతలకు అందుబాటులో ఉండని వైనాన్ని వివరించి చెప్పారు. పార్టీ తరపున పెట్టే ఏ కార్యక్రమంలో కూడా ఎంఎల్ఏ నేతలను కలుపుకుని వెళ్ళటం లేదన్న విషయాన్ని స్ధానిక నేతలు ఎత్తి చూపారు.

 

మొత్తం మీద జిల్లా పర్యటనలో అచ్చెన్నకు అర్ధమైందేమిటంటే, ఇద్దరు ఎంఎల్ఏలకు మళ్ళీ టిక్కెట్టిస్తే టిడిపి నేతలు సహకరించరని, వాళ్ళిద్దరు గెలవరని. దాంతో అమరావతికి తిరిగి వెళ్ళగానే అచ్చెన్న అదే విషయాన్ని చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం.  పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్ళీ టిక్కెట్లు దక్కేది అనుమానమే.  ఒకవేళ స్ధానిక నేతల అభిప్రాయాలను కాదని చంద్రబాబు మళ్ళీ వాళ్ళకే టిక్కెట్లిస్తే  నియోజకవర్గాలను ప్రత్యర్ధి పార్టీలకు అప్పచెప్పినట్లే.