వెయ్యి కోట్లకు చేరుకున్న బెట్టింగులు ?

రాష్ట్రంలో బెట్టింగుల జోరుతో మారు మోగిపోతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయళ్ళు బరిలోకి దిగినా తర్వాత మెల్లిగా ఊపు తగ్గిపోయింది. పోలింగ్ ముగిసిన రోజు నుండి దాదాపు పది రోజులు బెట్టింగ్ రాయళ్ళు రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపేశారు. అప్పట్లోనే సుమారు రూ 200 కోట్లకు పైగా బెట్టింగులు జరిగాయని సమాచారం. ఊపందుకున్న ప్రస్తుత బెట్టింగులకు రాజధాని గ్రామాలే కేంద్రాలు కావటం విచిత్రంగా ఉంది.

ఈమధ్య వరకూ స్తబ్దుగా ఉన్న బెట్టింగ్ ల జోరు ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఒక్కసారిగా విజృంభించింది. గడచిన మూడు రోజులుగా సుమారు వెయ్యి కోట్లకు పైగా బెట్టింగులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. బెట్టింగుల్లో ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు, రాజధాని జిల్లాలు, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా కేంద్రంగా నిలుస్తోందని సమాచారం.

ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంతో మొదలైన బెట్టింగులు తర్వాత నియోజకవర్గాల్లో గెలుపు, గెలిచే అభ్యర్ధులకు వచ్చే మెజారిటీ,  ఎంత మెజారిటీ వస్తుందనే అంశంపైన కూడా పందేలు జోరుగా జరిగాయి. గడచిన మూడు రోజులుగా బెట్టింగుల జోరంతా గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాలైన ఉండవల్లి, మందడం, పెనుమాక, ఎర్రుబాలెం, తాళ్ళూరు, తాడేపల్లి, నిడమర్రు, తాళ్ళాయిపాలెం, ఐనవోలు, వెలడపూడి, మల్కాపురంలో ఎక్కువగా కనిపిస్తోందట.

ఎగ్జిట్ ఫలితాలు వచ్చిన రోజు సుమారుగా రూ. 100 కోట్ల దాకా బెట్టింగులు జరిగినట్లు సమాచారం. తర్వాత మూడు రోజులు కూడా పందేల జోరు అంతకంతకు పెరిగిపోతోంది. చివరి రోజు కావటంతో బుధవారం మరింతగా బెట్టింగులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గెలుపోటములపై అభ్యర్ధుల్లో టెన్షన్ పెరిగిపోతుంటే బెట్టింగుల టెన్షన్ మరోవైపు రాష్ట్రాన్ని ఊపేస్తోంది.