అప్పుడే బెట్టింగుల జోరు..కోట్లలో టర్నోవర్

మరో 14 రోజుల్లో జరగబోయే పోలింగ్ విషయంలో అప్పుడే బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. ఒక్కోక్క అభ్యర్ధి గెలుపోటములపై లక్షల్లో కడుతున్న బెట్టింగు వల్ల కోట్ల రూపాయల్లో టర్నోవర్ పెరిగిపోతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే రాజధాని జిల్లాల్లో ఒకటైన కృష్ణా జిల్లాలో బెట్టింగుల జోరు బాగా ఎక్కువగా కనిపిస్తోంది.

జిల్లాలోని మొత్తం 16 నియోజకవర్గాల్లో వైసిపి, టిడిపి అభ్యర్ధుల గెలుపోటములపైనే ఎక్కువగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా మైలవరం, గన్నవరం, గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాలపైనే ఎక్కువమంది దృష్టి పెట్టినట్లు సమాచారం.

మైలవరంలో టిడిపి తరపున మంత్రి దేవినేని ఉమ పోటీలో ఉండగా వైసిపి తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. గుడివాడలో టిడిపి తరపున దేవినేని అవినాష్ రంగంలో ఉండగా వైసిపి నుండి సిట్టింగ్ ఎంఎల్ఏ కొడాలి నాని పోటీ చేస్తున్నారు. ఇక గన్నవరంలో అధికారపార్టీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, ప్రధాన ప్రతిపక్షం తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  అధికారపార్టీ అభ్యర్ధిగా బోండా ఉమ, ప్రధాన ప్రతిపక్షం తరపున మల్లాడి విష్ణు పోటీ చేస్తున్నారు.

పై నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల్లో గెలుపెవరిది అనేది ఓ బెట్టింగ్. గెలిచేవారిలో ఎవరికెంత మెజారిటీ వస్తుందనేది మరో రకమైన బెట్టింగ్.  అలాగే పలానా పార్టీనే అధికారంలోకి వస్తుందనేది మూడో బెట్టింగ్. పలానా పార్టీకి ఎన్ని సీట్లొస్తాయి ? అనేది నాలుగో రకమైన బెట్టింగ్.  ఇటువంటి బెట్టింగులు జిల్లా వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయి. లక్షల్లో జరిగే బెట్టింగ్ టర్నోవర్ హోలు మొత్తం మీద తీసుకుంటే కోట్లకు చేరుకుంటోంది. మరి బెట్టింగుల్లో ముణిగేదెవరో ? లాభపడేదెవరో ?