విశాఖ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ విజృంభించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కిడారితోపాటు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ మృతి చెందారు. కిడారిని కిడ్నాప్ చేస్తామని పలుమార్లు హెచ్చరించారు మావోయిస్టులు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు కంపించాయి. మావోయిష్టులు ఏకంగా ఒక ఎమ్మెల్యేని చంపడం ఈ మధ్య కాలంలో జరగనేలేదు. అందునా గిరిజన ఎమ్మెల్యేని చంపడంతో్, దానికి తోడు ఎన్నికల వాతావారణం కూడా నెలకొనడంతో తెలుగురాష్ట్రాల్లో పెద్ద భద్రతా చర్యలను తీసుకుంటున్నారు.
ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎమ్మెల్యే పై కాల్పులు జరపడంతో అంతా షాక్ కు గురయ్యారు. 2014 లో వైసీపి నుంచి కిడారి అరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన టిడిపిలో చేరారు. కాగా ఈరోజు అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి వస్తుండగా డుంబ్రి మండలం, లిప్పట్టి పుట్ట రహదారి వద్ద మావోయిస్టులు వీరిపై దాడి జరిపారు.
ఈ కాల్పుల్లో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. కిడారిని, శివేరి సోమని మినహాయించి మిగిలిన వారిని వాహనాల్లో నుండి దింపేశారు. ఆ తర్వాత గన్ మెన్ లను తమ ఆయుధాలను కింద పడేయాల్సిందిగా హెచ్చరించిన మావోయిస్టులు అతి సమీపం నుండి ఇరువురిని కాల్చి చంపేసినట్టు తెలుస్తోంది.
అయితే మావోయిస్టులు కిడారిపైన దాడి చేయడానికి కారణం బాక్సయిట్ వ్యవహారమని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో పలువురు బాక్సయిట్ తవ్వకాలు జరుపుతున్నారు. వీరికి కిడారి మద్దతు ఇస్తున్నాడని భావించిన మావోయిస్టులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ బాక్సయిట్ తవ్వకాలు ఆగకపోవడంతో ఆగ్రహించిన మావోయిస్టులు కిడారి, శివేరి సోమపై కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారు.