లోకేష్ గాలి తీసి.. తనదే తప్పు అంటున్న బండ్ల గణేష్!

ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మరిముఖ్యంగా నటుడిగా కంటే.. నిర్మాతగా కంటే.. ఆడియో ఫంక్షన్స్ లో హీరోలను ఆకాశానికెత్తే స్పీచ్ లు ఇవ్వడంలో బండ్ల గణేష్ బాగా ఫేమస్ అని అంటుంటారు! ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్ పై గణేష్ ఒక వైరల్ ట్వీట్ చేశారు!

బండ్ల గణేష్ నిత్యం సంచలనాలతో ఉంటారా… లేక, వివాదాలతో సావాసం చేస్తుంటారా అంటే చెప్పడం కాస్త కష్టమేమో కానీ… వివాదాలు – సంచలనాలు మాత్రం బండ్ల గణేష్ చుట్టూ ఉంటాయంటే అది అతిశయోక్తి కాదనేవారే ఎక్కువగా ఉంటుంటారు. ఈ నేపథ్యం లో తాజాగా నారా లోకేష్ పై స్పందించారు బండ్ల గణేష్.

అవును… ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. నేడు ఈ పాదయాత్ర 2000 కిలోమీటర్లకు చేరుకుంటుంది. సందర్భంగా తన పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుందని.. అందుకు అందరికీ థాంక్స్ అంటూ లోకేష్ చేసిన ట్వీట్ కు గణేష్ తనదైన శైలి లో స్పందించారు. లోకేష్ ఇంత దూరం పాదయాత్ర చేస్తారని తాను అనుకోలేదని ఏదో ఒక సాకుతో ఆపేస్తారని భావించానని గణేష్ చెప్పి గాలి తీస్తూ… తనది తప్పే అని ఒప్పుకోవడం గమనార్హం.

“నేను ఈరోజు 2000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర పూర్తి చేస్తున్నాను. ఇది దూరం మాత్రమే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ యువత యొక్క కలలు ఆకాంక్షల ను ప్రతిబింబించే ప్రయాణం. నాతో చేరిన వారందరికీ ధన్యవాదాలు కలిసి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం” అని నారా లోకేష్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.

అయితే ఈ ట్వీట్ పై స్పందించిన గణేష్… “నిజంగా నేను మీరు 200 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేయరు అనుకున్నా. ఏదో ఒక సాపు చెప్పి ఆపేస్తారని ఊహించుకున్న. కానీ నేను అనుకున్నది తప్పు. చాలా ఆనందం ఇచ్చింది మీరు 2000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేయడం నాకు మీ పార్టీతో సంబంధం లేదు కానీ మీరంటే అభిమానం.. ఆల్ ది బెస్ట్ మిస్టర్ లోకేష్!” అని రీట్వీట్ చేశారు!

లోకేష్ పై బండ్ల గణేష్ కి ఇంతకాలం ఇలాంటి అభిప్రాయం ఉందా? ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా.. ఏపీకి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చినబాబుపై బండ్ల గణేష్ కి పలాయనం చిత్తగించే వాడనే అభిప్రాయం ఉందా అని కొంతమంది తమ్ముళ్లు ఫీలవుతున్నారంట. అయితే… అయినా పర్లేదు ఇప్పటికైనా చినబాబు టాలెంట్ ఏమిటో బండ్లకు అర్ధమైంది అని మరికొంతమంది సంతృప్తి చెందుతున్నారంట.

ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు!