ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో మెజార్టీ ఒకింత గుర్రుగా వున్నారన్నది నిర్వివాదాంశం. దానికి కారణాలు అనేకం. ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు వివిధ అంశాల్లో షాకుల మీద షాకులు ఇస్తూ వచ్చింది.
సామాజిక వర్గం కోణంలో అనండీ, మరే కోణంలో అయినా అనండీ.. పరిశ్రమ అంతా ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి, వైసీపీకి వ్యతిరేకంగా నినదించే పరిస్థితి రావొచ్చేమో. ఔనా.? అలా జరుగుతుందా.? అని కొందరు అనుమానాల్ని వ్యక్తం చేయొచ్చుగాక.
కానీ, తెరవెనుకాల నందమూరి బాలకృష్ణ మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాల పేరుతో, ‘అన్నగారిపై అభిమానం’ పేరుతో టీడీపీకి విపరీతమైన ఎలివేషన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలో కొంత సక్సెస్ అయ్యారు కూడా.
అయితే, తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణలో స్థిరపడి వుంది. ఆ లెక్కన, టీడీపీకి కొందరు సినీ ప్రముఖులు అనుకూలమే అయినా, తెలంగాణలో మాత్రం గులాబీ పార్టీకే మద్దతివ్వాలి. అదెలాగూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, మెజార్టీ ఆచి తూచి స్పందించే అవకాశం వుంది.
2024 ఎన్నికల నాటికి, పలువురు ప్రముఖులతో ప్రచారానికి రప్పించేలా చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దానికోసం బాలయ్య శక్తివంచన లేకుండా చేస్తున్న కృషి.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.