జైల్లో బాబు… అవకాశాన్ని బాలయ్య సద్వినియోగం చేసుకున్నట్లేనా?

స్కిల్ డెవలప్ మెంట్స్ స్కాం కేసులో అరెస్టైన బాబుపై నిజంగానే ప్రేమో.. లేక, బాబు తర్వాత తాను కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అనుకూల మీడియాపై ఆగ్రహమో తెలియదు కానీ… ఈ రోజు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సందర్భంగా బాలయ్య గతంలో ఎన్నడూ లేనివిధంగా దూకుడు పెంచారు. బాబు తర్వాత టీడీపీకి తానే పెద్ద అనే కామెంట్ వినిపించేలా ప్రయత్నించారని అంటున్నారు!

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం శాసనసభాపక్షం నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పందించిన బాలయ్య చంద్రబాబు అక్రమ అరెస్టు అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణ చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.

ఇలా బయట దూకుడు చూపించిన బాలయ్య.. సభలోనూ అదేస్థాయిలో ఫైరయ్యారు. ఇంతకాలం అసెంబ్లీలో ఉన్నారా లేదా అన్నట్లుగా కనిపించే బాలయ్య… ఈ రోజు మాత్రం సీమసింహం అయిపోయారు! ఇందులో భాగంగా తొడ కొట్టడం, మీసాలు తిప్పడం వంటి పనులు చేశారు. దీంతో.. ఇలాంటి పనులు సినిమాల్లో చేసుకోవాలని వైసీపీ నుంచి సెటైర్లు పడ్డాయి!

ఆ సెటైర్లు, వెటకారాలు, ఎద్దేవాల సంగతి అలా ఉంటే… బాలయ్య తొడకొడుతున్నప్పుడు, మీసాలు మెలేస్తున్నప్పుడూ… సభలోని మహిళా సభ్యులంతా నవ్వుకోవడం కనిపించిందని అంటున్నారు. దీంతో… ఇంతకాలం బాలయ్యకు ఛాన్స్ ఇవ్వకుండా తొక్కేశారని.. లేకపోతే కచ్చితంగా బాబు ప్లేస్ ను అసెంబ్లీలో బాలయ్య రీప్లేస్ చేసి ఉండేవారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క బాలయ్య తొడకొట్టడాలు, మీసం మెలెయ్యడాలపై స్పీకర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి పనులు అసెంబ్లీలో చేయకూడదని, అది మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. అనంతరం మొదటి హెచ్చరిక జారీ చేశారు.

సరే స్పీకర్ వార్నింగ్ ఇచ్చినా, మోట్టికాయలు వేసినా, వైసీపీ నేతలు వెటకారం ఆడినా, మహిళా సభ్యులు నవ్వుకున్నా… అదంతా ఒకెత్తు అనుకుంటే… బాలయ్య మాత్రం ఈ రోజు దూకుడు ప్రదర్శించారనే అంటున్నారు తమ్ముళ్లు! చంద్రబాబు ఇంకా కొన్నేళ్లు బయటకు రాకపోయినా పార్టీని అసెంబ్లీలోనూ, బయటా నడపగల సత్తా తనకు ఉందని ఈ సందర్భంగా నిరూపించుకున్నారని తమ్ముళ్లు సంబరపడుతున్నారని సమాచారం.