స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో పార్టీలో స్తబ్ధ నెలకొందనే మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు లోపల ఉంటే.. ఆయనకు భోజనం పంపడం కోసం చినబాబు బయట ఉన్నారని చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీని తాను హ్యాండిల్ చేస్తానన్నట్లుగా బాలయ్య రియాక్ట్ అయ్యారు. ఎవరూ కంగారూ పడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.
ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ ను తట్టుకోలేని కొన్ని గుండెలు ఆగిపోయాయని, వాళ్లందరినీ వారి వారి ఇండ్లకూ వెళ్లి తానే స్వయంగా పరామర్శించి, ఓదార్చి వస్తానని చెప్పారు. దీంతో బాలయ్య దూకుడు పెంచాడు అనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం జరిగిన మరణాలు… బాబు కోసం కాదని, అందుకు వేరే కారణాలున్నాయని సాక్షి వివరించింది.
చంద్రబాబు అరెస్ట్ కారణంగా ఆగిన గుండె.. చంద్రబాబు విచారణ టీవీలో చూస్తూ అర్ధాంతరంగా ఆగిన శ్వాస.. బాబు జైలుకెళ్లగానే గాల్లో కలిసిన ప్రాణం.. అంటూ కొన్ని రోజులుగా టీడీపీ అనుకూల మీడియా వాయించి వదులుతుంది. అయితే ఈ విషయాన్ని జనం ఎంత సీరియస్ గా తీసుకున్నారనే సంగతి కాసేపు పక్కనపెడితే… “పరాకాష్టకు చేరిన టీడీపీ శవరాజకీయం” అంటూ సాక్షి మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా అనారోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం, హైబీపీ, కిడ్నీ సమస్యలు, ఆస్తమా, కుటుంబ సమస్యలతో బలవన్మరణం.. ఇలా చాలా కారణాలతో జనం చనిపోతే… అది తనను జైల్లో పెట్టినందుకే అని తమ ఖాతాలో వేసుకోవడం నిస్సిగ్గు చర్య అని సాక్షి తాజాగా వివరించారు.
ఆ కారణాలన్నీ పక్కనపెట్టి చంద్రబాబు కోసమే ఆ ప్రాణాలు పోయినట్టు బిల్డప్ ఇస్తున్నారని, తప్పుడు కథనాలు రాస్తున్నారని సాక్షి మండిపడింది. దీంతో ఓదార్పు యాత్ర చేసి ప్రజల్లో కాస్త పబ్లిసిటీ విత్ సింపతీ పొందుదామని బాలయ్య ప్రయత్నిస్తుంటే… ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా… అందరికీ తెలిసేలా వ్యూహాలు రచించడంతో గత కొంతకాలంగా టీడీపీ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది.
