బాబుకి బ్యాడ్ న్యూస్… వారికి సెకండ్ ఆప్షన్ జనసేన?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకీ మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారు అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయిందన్నా అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో అధికార వైసీపీలో ప్రస్తుతం ఒకటి రెండు నియోజకవర్గాల్లో అంతర్గత పోరు నడుస్తుంది. ఇప్పుడు వారికి జనసేన సెకండ్ ఆప్షన్ అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును… ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మధ్య వర్గపోరు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్థానికేతరుడైన వేణు.. రామచంద్రాపురం వైస్పీలో కేడర్ లో చీలికలు తెచ్చారని పిల్లి సుభాష్ ఆరోపిస్తున్నారు.

అసలు ఎవరు కార్యకర్తో ఎవరు అవసరం కోసం వచ్చిన వ్యక్తో వేణుకి ఏమి తెలుసని, తాను సుమారు 30 ఏళ్లుగా రామచంద్రాపురం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నానని పిల్లి సుభాష్ చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈసారి తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని అంటున్నారు.

దీంతో ఆర్సీపురంలో పిల్లి సుభాష్ వర్సెస్ చెల్లుబోయిన వేణు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సుభాష్ ని పిలిచి జగన్ మాట్లాడిన అనంతరం కూడా పరిస్థితి సద్దుమణగలేదు. జగన్ తో భేటీ అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన సుభాష్ … ఈసారి రామచంద్రపురం టిక్కెట్టు మంత్రి వేణుకి ఇస్తే తాను కానీ, తన కుమారుడు కానీ ఇండిపెండెట్ గా పోటీచేయబోతున్నట్లు చెబుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో కూడా సెం పంచాయతీ తెరపైకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు మరోసారి పోటీ కోసం సిద్ధమవుతున్నారు. అయితే ఇంతకాలం పెద్దగా యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించని ఆయన… సడన్ గా తనకు మరోసారి టిక్కెట్ కావాలని అంటున్నారు.

అయితే… గన్నవరంలో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ అనంతరం వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా జెండా కప్పుకోకపోయినా… రాబోయే ఎన్నికల్లో గన్నవరం వైసీపీ టిక్కెట్ ఆయనదే అనేది ఆల్ మోస్ట్ కన్ ఫాం అని అంటుంటారు. ఈ సమయంలో వైసీపీ గత ఎన్నికల అభ్యర్థి యార్లగడ్డా లైన్ లోకి వచ్చారు.

వంశీకి కాకుండా తనకు గన్నవరం టికెట్ తనకే కావాలంటున్న ఆయన.. రాకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి వెళ్తానన్న ప్రచారాన్ని మాత్రం ఆయన ఇవాళ ఖండించారు. అయితే ఇప్పటికే వంశీకి టికెట్ పై హామీ ఇచ్చిన జగన్ దాన్ని వెనక్కి తీసుకునే పరిస్దితి లేదు. కాబట్టి యార్లగడ్డను త్వరలో పిలిపించి మాట్లాడేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అధికారంలో ఉన్న పార్టీలో ఒకటిరెండు చోట్ల ఈ మాత్రం ఇబ్బందులు సహజమే అనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ సమయంలో అధికారపార్టీలో అలిగిన వారికి టీడీపీ సెకండ్ ఆప్షన్ అనే మాట రావకపోవడం. అవును… రామచంద్రాపురంలో కూడా టిక్కెట్ దక్కకపోతే పైకి ఇండిపెండెంట్ అంటున్నారు కానీ, పిల్లి ఫ్యామిలీ జనసేన నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందన్ని కథనాలొస్తున్నాయి.

ఇదే సమయంలో తాజాగా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు సైతం టీడీపీలో చేరబోతున్నారనే విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాను తప్ప.. టీడీపీలో చేరేది లేదని అన్నారు. దీంతో… ఈఅయనకు కూడా జనసేనే సెకండ్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే… అధికారపార్టీలో అలిగిన వారికి, టిక్కెట్ దక్కనివారికి టీడీపీ సెకండ్ ఆప్షన్ కాదు.. జనసేనే సెకండ్ ఆప్షన్ అని!

దీంతో బాబు గ్రాఫ్ తగ్గిందా.. లేక, పవన్ గ్రాఫ్ పెరిగిందా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఏపీలో అధికారపక్షం సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీకి జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందా అనే చర్చ మొదలైందని అంటున్నారు పరిశీలకులు. మరి ఎన్నికల నాటికీ ఇదే ట్రెండ్ కొనసాగుతోందా.. లేక, విషయం గ్రహించి చంద్రబాబు నివారణ చర్యలు చేపడతారా అనేది వేచి చూడాలి!