పాపం బాబు: కరవమంటే కప్పకు – విడవమంటే పాముకి…!

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యిందనే చెప్పుకోవాలి. ‘ఎలాంటి చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితి వచ్చిందయ్యా…’ అని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆవేదన చెందేస్థాయికి బాబు పరిస్థితి పడిపోయిందన్నా అతిశయోక్తి కాదేమో! అందుకు ప్రధాన కారణం దాదాపు అందరికీ తెలిసిందే! ఇప్పుడు ఆ కారణంతో మరో కొత్త సమస్య వచ్చిపడింది!

వివరాళ్లోకి వెళ్తే… ఏపీ రాజధాని నామకరణం “అమరావతి” అని ఏ ముహూర్తాన్న చేశారో కానీ.. నాటినుంచి ఈ వ్యవహారం బాబును ముప్పుతిప్పలు పెట్టేస్తుంది. ఈ విషయంలో ఇంతకాలం అమరావతిని పూర్తిగా సమర్ధిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు, రైతుయాత్రలు అంటూ నానా హడావిడీ చేశారు చంద్రబాబు! దానికి తగ్గట్టుగానే అమరావతి ప్రజానికం పోరాటాల్లో బాబుకు పూర్తిమద్దతు ప్రకటించారు! అయితే ఉన్నట్లుండి బాబు, ఈ అమరావతి విషయంలో పూర్తిగా మౌనాన్నే తమ బాషగా చేసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు.

అందుకు కారణాలు రెండు! ఒకటి.. కేవలం అమరావతి అమరావతి అని మాత్రమే బాబు పోరాటాలు ఉండటం వల్ల… టీడీపీ పరిస్థితీ 23 స్థానాల నుంచి 2 జిల్లాలకు పరిమితం అయిపోతుంది! ఇది పూర్తిగా వైకాపా వ్యూహంలో భాగమనేది తెలిసిన విషయమే! ఇక రెండోది.. టీడీపీకి బలమైన పునాదులు, మద్దతుదారులూ ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి!

దీంతో.. జగన్ చెప్పే అభివృద్ధి వికేంద్రీకరణకు అంగీకారంగా మాట్లాడలేక.., ఇటు తాను నమ్ముకున్న, తనను నమ్ముకున్న అమరావతి జనాలకు మద్దతుగా పోరాడలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు గమనించిన ఆయన అభిమానులు… కరవమంటే కప్పకు కోపం – విడవమంటే పాముకు కోపం అన్న చందంగా అయిపోయింది బాబు పరిస్థితి అంటున్నారు! ప్రస్తుతం మౌనంగా ఉన్నా.. ఎన్నికల నాటికైతే బాబు ఒక స్టాండ్ తీసుకోవాల్సి రావొచ్చు! అమరావతే ఏకైక రాజధానిగా ఎన్నికలకు వెళ్తారా..? లేక, అసలు రాజధాని అనే టాపిక్ నే సైలంట్ చేసి ప్రసంగిస్తారా? అన్నది వేచి చూడాలి! ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో రాజధానిపై బాబు ఇచ్చే క్లారిటీపైనే.. ప్రజలకు టీడీపీ పై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కన్ ఫాం!