ఇది ప్రజాస్వామ్యమనుకుంటున్నారా.? రౌడీ స్వామ్యమనుకుంటున్నారా.? గతంలో మంత్రిగా పని చేసిన వ్యక్తి, బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా.? ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న వ్యక్తి మాట మీద అదుపు కోల్పోతే ఎలా.? ఇద్దరిదీ తప్పే.! ఒకరు తక్కువా కాదు, ఇంకొకరు ఎక్కువా కాదు.. సరిసామనం.. విలువల్ని దిగజార్చేయడంలో.
ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే, ఇంకొకరు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. ఇద్దరూ కలిసి గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. కారుకూతలు కూస్తున్నారు. మీడియాకెక్కి నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు.
అయ్యన్న నోటి దురద ఫలితం, ఆయన ఇంటి మీదకి ప్రభుత్వం జేసీబీని పంపింది. కానీ, ప్రభుత్వానికి కోర్టు చీవాట్లు పెట్టింది. ఇదీ సంగతి.! అయినా, ఎవరికీ బుద్ధి రాలేదు. అధికార వైసీపీ, షరామామూలుగానే అయ్యన్నమీద రెచ్చిపోతోంది. అయ్యన్న కొన్నాళ్ళు సైలెంటయినా, మళ్ళీ జూలు విదుల్చుతున్నారు.
‘నన్ను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే వుంది. జేసీబీలు, ఐపీఎస్‌లు, ఆ్డడీవోలు, వందల సంఖ్య పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు.. అంత భయం ఎందుకు సాయిరెడ్డీ.. దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చెయ్ తేల్చుకుందాం..’ అంటూ అయ్యన్న సవాల్ విసిరేశారు.
రోడ్డున పడి కొట్టుకోవడానికి ఇది రౌడీ స్వామ్యం కాదు.! కోర్టులో కేసు పడింది.. అక్కడేం తేలుతుందన్నదానిపై ఇరువురూ సంయమనం పాటించాలి. కానీ, ఈ రాజకీయాల్లో సంయమనం అన్న పదానికే అర్థం లేకుండా పోయింది.