అవినాష్ రెడ్డి అరెస్ట్.. టీడీపీ నేతలకు గతం గుర్తుచేస్తున్నారు!

ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ప్రతిరోజూ మీడియాలో అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన ఒక కథనం ప్రధానంగా ప్రచురితం అవుతుంది. ఇదే సమయంలో కొన్ని టీవీ ఛానల్స్ లో డైలీ ఒక డిబెట్ ఉంటుంది! ఆ సమయంలో టీడీపీ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు ఆన్ లైన్ వేదికగా సమాధానాలు ఇస్తున్నారు నెటిజన్లు.

తన తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. దీంతో ఈ విషయాలపై టీడీపీ నేతలు, ఒక వర్గం మీడియా చెలరేగిపోతుంది. ఆఖరికి సీబీఐ నిబద్దతను కూడా ప్రశ్నిస్తుంది. విచిత్రంగా గతంలో ఏపీలో సీబీఐ కి ప్రవేశం లేకుండా జీవో తెచ్చిన టీడీపీ నేతలే ఇప్పుడు సీబీఐ పై ప్రశ్నలు కురిపించడం గమనార్హం.

దీంతో… అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడన్నదానిపై అసలు ఇంత ఉత్కంఠ దేనికి? అసలు ఎవరిని అరెస్టు చేయాలి? ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎక్కడ అరెస్ట్ చేయాలి? ఇవన్నీ చెప్పడానికి మీడియా ఎవరు? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే తేల్చేయడం ఏంటి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే “అదంతా నాటకం.. డ్రామా..” అంటూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేస్తుండటం మరీ దిగజారుడుతనం అనేది మరో కామెంట్. విచిత్రంగా కర్నూలు లోనే ఎందుకు… హైదరబాద్ హాస్పటల్ లో ఉండొచ్చుకదా అని కూడా సూచిస్తున్నారు. దీంతో… టీడీపీ నేతలకు సంబంధించిన పాత విషయాలు తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు.

అవును… అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరిన విషయాలను గుర్తుకు తెస్తున్నారు నెటిజన్లు. అచ్చెనాయుడు తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేని విషయం తెలిసిందే. నాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆన్ లైన్ లో ఫోటోలు పోస్ట్ చేస్తూ గుర్తుచేస్తున్నారు నెటిజన్లు.

దానితోపాటు… మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచంపై పడుకుని ఆరోగ్యం బాగా లేదని చెప్పిన విషయాలనూ, దానికి సంబంధించిన వీడియోలనూ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదేసమయంలో… నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు… మానసిక పరిస్థితి బాగా లేదని, మతి చలించిందని సర్టిఫికెట్ తీసుకుని అరెస్ట్ నుంచి తప్పించుకున్నా సంఘటనను గుర్తు చేస్తున్నారు.

ఇలా డైలీ ఒక ఎపీసోడ్ లా జరుగుతున్న “అవినాష్ రెడ్డి అరెస్ట్?” అనే కథనానికి సంబంధించి టీడీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు ఆన్ లైన్ లో ఆన్సర్స్ ఇస్తున్నారు నెటిజన్లు! ఇదేసమయంలో… ఇంతకూ ఏపీలోకి సీబీఐ కి ఎంట్రీ ఉందా లేదా అనే విషయంపై టీడీపీ నేతల సమాధానం ఏమిటంటూ ప్రశ్నలు రావడం కొసమెరుపు!