మొన్నామధ్య ఓ వైసీపీ ఎమ్మెల్సీ, తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన దళిత యువకుడ్ని చంపేస్తే, అప్పట్లో ఆయన్ని వైసీపీ వదిలించుకుంది. పార్టీ నుంచి బయటకు పంపేశాక, ‘ఆయనతో మాకేంటి సంబంధం’ అని చేతులు దులుపుకుంది వైసీపీ. అదే పరిస్థితి వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా వస్తుందా.? కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో వైసీపీ ఆలోచనలు ఎలా వున్నాయి.? ఈ విషయమై టీడీపీ అనుకూల మీడియా చిత్ర విచిత్రమైన విశ్లేషణలు చేస్తోంది. అవినాష్ రెడ్డిని వదిలించుకోవడానికి వైసీపీ యోచిస్తోందంటూ టీడీపీ శ్రేణులు లీకులు వదులుతున్నాయి. వాటిని, టీడీపీ అనుకూల మీడియా మరింతగా హైలైట్ చేస్తూ వస్తోంది.
అక్కడికేదో, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ‘దోషి’గా న్యాయస్థానాలు నిర్ధారించేసినట్లుంది టీడీపీ చేస్తున్న అతి చూస్తోంటే. అవినాష్ రెడ్డి ఇరుక్కుపోయారనీ, దాంతో, పార్టీ నుంచి పంపేయడానికి జగన్ సమాలోచనలు చేస్తున్నారనీ టీడీపీ నేతలు చెబుతున్నారు.
అయితే, ‘ఆ పరిస్థితే లేదు. సీబీఐ విచారణ పేరుతో వైసీపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ కూడా గతంలో కాంగ్రెస్ వ్యవహరించినట్లే, కక్ష సాధింపు చర్యలకు దిగుతూ సీబీఐని తనకు అనుకూలంగా మలచుకుంటోంది..’ అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అనూహ్యంగా వైసీపీ, బీజేపీ మీద విమర్శలు చేస్తుండడం చూస్తోంటే, వైసీపీలో ప్రమాద ఘంటికలు మోగినట్లేనేమో.. అన్న భావన వ్యక్తమవుతుండడం సహజం.