విశాఖ జిల్లా రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు.. ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గంటా, అవంతి మధ్య ఒకప్పుడు సన్నిహిత సంబంధాలే వుండేవి. కానీ, ఆ తర్వాత ఇద్దరూ పార్టీల పరంగా విడిపోయారు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. అయినాగానీ, తెరవెనుకాల అవంతి – గంటా మధ్య ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే వున్నాయంటారు. రాజకీయంగా ఆధిపత్య పోరు తప్ప, మిగతా విషయాల్లో ఇద్దరూ పరస్పరం కలుసుకుంటారనీ, మాట్లాడుకుంటారనీ, సహకరించుకుంటారనీ.. విశాఖ జనం చర్చించుకుంటుంటారు.
ప్రస్తుతం వైసీపీలో వున్న అవంతి శ్రీనివాసరావు, త్వరలో టీడీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి దూకేస్తారని అంటున్నారు. గంటా చేరికకు వైసీపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించేసిందనీ, అది నచ్చక అవంతి పార్టీ మారబోతున్నారనీ తెలుస్తోంది. మంత్రి పదవి పోయాక అవంతికి, పార్టీ పదవి దక్కింది. ఆ పార్టీ పదవి కూడా ఇటీవలే ఊడింది. దాంతో ఆయన పార్టీ మారక తప్పడంలేదు. జనసేన వైపుగా అవంతి చూసే అవకాశాలున్నాగానీ, జనసేన ఆయన్ని దగ్గరకు రానివ్వడంలేదట.
గతంలో అవంతి టీడీపీ నుంచి లోక్ సభ సభ్యుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అవంతి క్రౌడ్ పుల్లర్ కాదనీ, వచ్చే ఎన్నికల్లో విశాఖలో పార్టీ మరింత బలోపేతమవ్వాలంటే గంటా అవసరం వుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తుండడం వల్లే గంటాకి వైసీపీలోకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం.