రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూమా కుటుంబానికి ఏవి సుబ్బారెడ్డి సెగ తప్పేట్లు లేదు. ఏవి ఒకపుడు భూమా నాగిరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. భూమా నాగిరెడ్డి టిడిపిలోకి ఫిరాయిస్తే ఏవి కూడా అనుసరించారు. కాకపోతే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల ఏవి సుబ్బారెడ్డి దూరమైపోయారు. ఆ తర్వాత భూమా అఖిలప్రియ కారుణ్య నియామాకాల్లో మంత్రిపదవి అవ్వటం తర్వాత నంద్యాల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలవటం అందరికీ తెలిసిందే.
ఎప్పుడైతే భూమా అఖిలప్రియ మంత్రయ్యారో అప్పటి నుండి ఫిరాయింపు మంత్రికి ఏవికి గొడవ మొదలైంది. ఆ గొడవలే చిలికి చిలికి గాలవానలగ తయారై చివరకు రాబోయే ఎన్నికల్లో అఖిలప్రియను ఓడిస్తానని బహిరంగంగానే సవాలు చేసేదాకా వచ్చింది పరిస్ధితి. ఇప్పుడు విషయం ఏమిటంటే, తాజాగా నంద్యాలలో సొంతంగా పార్టీ ఆఫీసును కూడా తెరిచారు. పార్టీని పటిష్టం చేయటానికే తాను కార్యాలయం తెరిచినట్లు చెబుతున్నా అదంతా ఉత్తదేనని అందరికీ తెలుసు.
అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో నంద్యాల లేదా ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో ఎక్కడ టిక్కెట్టిచ్చినా సరే పోటీ చేస్తానంటూ ప్రకటించటం కలకలం రేపుతోంది. ఫిరాయింపు మంత్రి ఆళగడ్డలో ప్రాతినిధ్యం వహిస్తోంది. సోదరుడు బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో సిట్టింగ్ ఎంఎల్ఏ. మరి పై రెండు సీట్లలో ఎక్కడ టిక్కెట్టిచ్చినా పోటీకి రెడీ అని అంటున్నారంటే అర్ధమేంటి. సిట్టింగ్ ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లో సీనియర్ నేతే అయినా ఏవి టిక్కెట్టు ఎలా ఆశిస్తున్నారు ? అంటే ఇక్కడే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.
భూమా కుటుంబమంటే జిల్లాలో చాలామంది టిడిపి నేతలకు ఏమాత్రం పడదు. అలాంటి నేతలందరూ కలిసి ఫిరాయింపు మంత్రి, సోదరుడికి వ్యతిరేకంగా తెరవెనుక ఉండి ఏవిని రెచ్చ గొడుతున్నట్లు సమాచారం. దానికితోడు భూమా కుటుంబంపై చంద్రబాబునాయుడు సర్వే చేయించినపుడు బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దాంతో ఇద్దరిలో ఒకరిని మార్చటం ఖాయమనే ప్రచారం పార్టీలో జోరందుకుంది. అందుకనే ఏవి పై ఇటు నంద్యాల అటు ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో ఏవి కర్చీఫ్ వేశారు. దాంతో భూమా కుటుంబానికి ఏవి సెగ తప్పేట్లు లేదు.