ఆంధ్రప్రదేశ్ పంచాయతీ తొలిదశ పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచార గడువు ముగిసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో కూడా తొలిదశ లోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే కొత్తూరు మండలంలోని మాతల గ్రామంలో అత్తాకోడళ్లు పంచాయతీ ఎన్నికల్లో పోటీపడుతుంటం అందరిని దృష్టని ఆకర్షిస్తోంది. అందులో అత్తకు టీడీపీ మద్దతుగా నిలుస్తుండగా, కోడలుకు వైసీపీ మద్దతిస్తోంది. అయితే వారిద్దరు పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్‌రావు కుటుంబ సభ్యులు కావడం మరింత చర్చనీయాంశంగా మారింది.
కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ టీడీపీ నుంచి , చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. గతంలో నాలుగు సార్లు వేణమ్మ గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. అయితే ఈసారి కోడలే వేణమ్మపై పోటీకి నిలవడంతో.. ఎవరు సర్పంచ్ అవుతారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం వేణమ్మ, సుప్రియలు జోరుగా ప్రచారం చేపట్టారు.