ఆంధ్రప్రదేశ్ మంత్రులపై దాడి.! పోలీసు వైఫల్యమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పలువురిపై విశాఖపట్నంలో దాడి జరిగింది. అలాగని, బాధిత మంత్రులే చెబుతున్నారు. ఈ లిస్టులో మంత్రులు రోజా, జోగి రమేష్ తదితరులున్నారు. రోజాపై హెల్మెట్‌తో దాడి జరిగిందట. జోగి రమేష్ మీద కర్రలు, రాళ్ళతో దాడి జరిగిందట. ప్రస్తుతానికైతే ఇది ‘అట’ మాత్రమే. ఎందుకంటే, ఈ దాడికి సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రాలేదు.

మంత్రులంటే, వారి చుట్టూ గన్‌మెన్లు, అధికారులు వుంటారు. పైగా, అధికార పార్టీ విశాఖలో గర్జన కార్యక్రమాన్ని నిర్వహించింది.. పలువురు మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటప్పుడు వారికి కట్టుదిట్టమైన భద్రత ఖచ్చితంగా పోలీసుల వైపు నుంచి వుంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు ప్రతి సంఘటననూ వీడియోలో చిత్రీకరించడం జరుగుతుంటుంది.

ఇంతవరకు వైసీపీ అనుకూల మీడియా నుంచి కావొచ్చు, ప్రభుత్వం నుంచి కావొచ్చు, పోలీసుల నుంచి కావొచ్చు.. ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసైనికులే దాడి చేశారని మంత్రులు చెబుతున్నారు. మరి, ఆ సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు.? ఈ ప్రశ్నకు సరైన సమాధానం వైసీపీ నుంచి రావడంలేదు.

పవన్ కళ్యాణ్ రావడం వల్లే ఇదంతా జరిగిందన్నది ప్రభుత్వం తరఫున వినిపిస్తున్న వాదన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఈ మేరకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడుతుంటాయి. జనం గుమికూడటం.. అనేది సర్వసాధారణమైన విషయం.

ఉదయం వైసీపీ గర్జన జరిగింది. అప్పుడు అమల్లో లేని నిబంధనలు, సాయంత్రానికి ఎలా వచ్చాయన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే. మిగతా విషయాలెలా వున్నా, మంత్రులపై దాడి అంటే అది పోలీసు శాఖ వైఫల్యమే. అమలాపురంలో ఓ మంత్రి ఇల్లు తగలబడితేనే, ఇంతవరకు దానికి కారణమైన అసలు దోషులెవరన్నది తేలలేదు. ఇలా వుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పని తీరు.