అభిమాన హీరోని చూసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడు?

అనంతపురంలో నిర్వహించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి తన అభిమాన హీరోని చూడాలన్న కోరికతో యువకుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. గుత్తి నుండి అనంతపురం వెళ్తూ గార్లదిన్నె సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురికావడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రాజశేఖర్‌(23) అనే యువకుడు చిరంజీవికి వీరాభిమాని. నిన్న అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన చిరంజీవిని చూడటానికి తన స్నేహితులతో కలిసి రాజశేఖర్ బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు
గార్లదిన్నె మండలం తలగాచిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై వెళ్తుండగా కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు.

దీంతో వేగంగా వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో రాజశేఖర్ కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్నేహితుడు అభిరామ్ కి కూడా స్వల్ప గాయాలు అవటంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు