అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా యాక్ట్ చేయడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కాకపోతే గతంలో ఈ విషయాలు ప్రజలు గ్రహించేవారు కాదు.. ఇప్పుడు ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల అన్ని విషయాలూ నిశితంగా పరిశీలిస్తూ.. తమను నిర్లక్ష్యం చేసే పార్టీలను సరైన సమయం చూసి గూబలు వాచేలా దెబ్బకొడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ విషయంలో జరిగిందిదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అయితే… అధికారంలో ఉండగా కన్నూ మిన్నూ కానలేదు.. ఈసారి అలా చేయం.. ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు అచ్చెన్నాయుడు!
అవును… ఇంత కాలానికి ఒక నిజం మాట్లాడారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు! అదేమిటంటే… బీసీలు తెలుగుదేశంపార్టీకి దూరమయ్యారని! తాజాగా జరిగిన బీసీ నేతల సభలో మైకందుకున్న అచ్చెన్నాయుడు… కొన్ని కారణాల వల్ల బీసీలు టీడీపీకి దూరమై, వైసీపీకి దగ్గరయ్యారని అంగీకరించారు. జరిగిన తప్పులేవో జరిగిపోయాయి కాబట్టి వాటిగురించి మాట్లుడుకోవటం అనవసరమన్నట్లుగా చెప్పారు. బీసీలను చంద్రబాబునాయుడు అక్కున చేర్చుకుంటారని.. మళ్ళీ చంద్రబాబుని నమ్మాలని చెప్పుకొస్తున్నారు. “బీసీలకు మొదటి నుంచి తెదేపా అండగా ఉంది. 2019లో కొన్ని వర్గాలు దూరం కావడంతో ఎన్నికల్లో ఓడిపోయాం. ఈసారి ఆ పరిస్థితి రాకుండా.. అందరి సమస్యలను పరిష్కరిస్తాం…” అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… టీడీపీ ఆవిర్భావం నుంచీ బీసీల్లో మెజారిటి సెక్షన్లు పార్టీనే అంటిపెట్టుకున్నారు. అయితే అదంతా ఎన్టీఆర్ పుణ్యమనేది తెలిసిన విషయమే. అయితే పార్టీపగ్గాలు చంద్రబాబు చేతికొచ్చిన తర్వాత కొత్తగా పార్టీకి దగ్గరైన బీసీలు ఎవరు లేరు. బీసీలను ఆదరించినా ఆదరించకపోయినా మెజారిటి సెక్షన్లు మాత్రం టీడీపీతోన ఉన్నారు. కానీ మారిన పరిస్థితులవల్ల.. చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల.. నోటిదురుసు చూపించడం వల్ల బీసీల్లో చీలికవచ్చింది. మెజారిటీ బీసీలు బాబును దూరం పెట్టారు. నిన్ను నమ్మం బాబు అనే స్లోగన్ తో ఏకీభవించారు. ఫలితమే… 2019 ఎన్నికల ఫలితాలు!
అయితే ఈ విషయాన్ని ఇంతాకాలం టీడీపీ నేతలు అంగీకరించలేదు. తామెందుకు ఓడిపోయామో ఇప్పటికీ తెలియడం లేదని చంద్రబాబు చెప్పుకుంటుంటే… బీసీలు చంద్రబాబుని వంచించారన్న స్థాయిలో కొందరు టీడీపీ నేతలు నోరు జారారు. అయితే… మాడు పగిలాక తత్వం బోదపడిందో… లేక, మరో ఆప్షన్ లేక ఇలా మారుమనస్సొచ్చిందో… అదీగాక మరోసారి వంచన కార్యక్రమానికి ఎర రెడీ చేస్తున్నారో తెలియదు కానీ… ఈసారి బీసీల గురించి కొత్త కొత్త పథకాలు ఆలోచిస్తున్నాం.. కాబట్టి రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు అచ్చెన్నాయుడు!
మరి అచ్చెన్నలో వచ్చిన ఈ మార్పు నిజమైనదే అని ప్రజలు భావిస్తారో.. లేక, పార్టీ పని అయిపోయింది – పార్టీ లేదు డ్యాష్ లేదు అని గదుల్లో మాట్లాడుకుని, బయటకు వచ్చాక రాబోయేది మన పార్టీనే అని చెబుతున్న మాటల్లాగానే వీటినీ నమ్ముతారాన్నది వేచి చూడాలి!